నైజీరియా దేశపు యోరుబా థియేటర్

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా నాటకాలు మరియు మతాచారాలు విడదీయలేనివిగా ఉంటాయి. గ్రీకు, సంస్కృతం మరియు ఇంగ్లీషు నాటకాలు అన్నీ కూడా మతం, పండుగలు మరియు ఆచారాల నుండి స్ఫూర్తిపొందినవిగా లేదా ఉద్భవించినవిగా ఉన్నాయి. నైజీరియాలోని యోరుబా ప్రదర్శనల గురించి కూడా ఇదే విధంగా చెప్పొచ్చు; యోరుబా థియేటర్ (Yoruba theatre)లో అక్కడి దేశపు ప్రజలు యొక్క సంప్రదాయాలను నాటకరంగం మీద ప్రతిబింబిస్తారు. యోరుబా థియేటర్ అనేది రంగురంగుల దుస్తులు, సంగీతం, డ్రమ్మింగ్ మరియు మైమ్‌ల కలయికగా ఉంటుంది. ఈ ప్రదర్శనల జననం “ఎంగున్గున్ మాస్కరేడ్” అనే సాంప్రదాయం నుండి వచ్చింది అని చెప్తారు. ఈ ఎంగున్గున్ మాస్కరేడ్ లో చనిపోయిన పూర్వీకులు భూగోళానికి వచ్చి తమ ప్రస్తుత తరం వారిని కలిసి వెళ్తారని నమ్ముతారు.

ఇది కాకుండా, యోరుబా యొక్క సర్వదేవతాగణము కూడా నాటకప్రదర్శనలో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒబటాల, సృష్టి యొక్క స్పిరిట్; ఓగున్, సృజనాత్మకత యొక్క స్పిరిట్ మరియు సాంగో, మెరుపు యొక్క స్పిరిట్ – వీరిని తరచుగా నాటకాలలో పాత్రలుగా ఎంచుకుంటారు. సర్వదేవతాగణము లోని ఈ సభ్యులు యోరుబా ప్రదర్శనలలో నటీనటుల రచనా శైలి మరియు పనితీరుపై అపారమైన ప్రభావాన్ని చూపుతారు.

యోరుబా థియేటర్ – రకాలు

కాలక్రమేణా యోరుబా థియేటర్ రెండు రకాలుగా రూపాంతరం చెందింది. రిచువల్ డ్రామా మరియు డీరిచువల్ డ్రామా అని వాటిని పిలుస్తారు. రిచువల్ డ్రామాలో ఎక్కువగా ఆధ్యాత్మికమైన అంశాలు, ఆచారాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. డీరిచువల్ డ్రామాలో అధికంగా లౌకిక అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇలా నాటకం రూపాంతరం చెందడం అనేది దాదాపు ప్రతి సాహిత్యంలోనూ కనిపిస్తుంది, పైగా ఒకేలా అనిపిస్తుంది. సమాజం మెరుగయ్యే కొద్దీ, ప్రజల అభిప్రాయాలు మార్పు చెందే కొద్దీ లౌకికపరమైన ఇష్టాలు పెరగడం, అది కొత్త రకమైనటువంటి నాటకాలకు నాంది పలకడం సర్వసాధారణం. జానపద కథలు మరియు పురాణాలు రిచువల్ డ్రామాలో ప్రస్తావించబడితే; సామాజిక వ్యంగ్య కథనాలు మరియు రాజకీయ ఇతివృత్తాలు డీరిచువల్ నాటకాలలో ప్రస్తావించబడుతాయి.

యోరుబా థియేటర్

ట్రూప్స్

ఒక చోటు నుండి మరొక చోటుకు ప్రయాణిస్తూ దేశమంతటా నాటకప్రదర్శన చేసే బృందాలను ‘ట్రావెలింగ్ ట్రూప్స్’ అని పిలుస్తారు. ఎంగున్గున్ మాస్కరేడ్లు ప్రసిద్ధి చెందడంతో ఇలాంటి బృందాలు నైజీరియా అంతటా విస్తరించడం మొదలుపెట్టాయి. అందులో ముఖ్యంగా ‘అలాంజో’ బృందం అందరికీ సుపరిచితం అయ్యింది. వీరు చిన్న విడిది గల విమర్శనాత్మక సన్నివేశాలను ప్రదర్శించేవారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యోరుబా ట్రావెలింగ్ థియేటర్ ఏర్పడింది. నైజీరియాలో 20వ శతాబ్దంలో ఈ థియేటర్ బాగా ప్రాచుర్యం పొంది అసంఖ్యాకమైన ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే ఇందులో ప్రసిద్ధి చెందిన వారు సొంత బృందాలను ఏర్పాటు చేసుకోవడం, కొత్త ఆలోచనలతో ముందుకు రావడంతో యోరుబా థియేటర్ ప్రపంచ సాహిత్యంలో చోటు సంపాదించుకుంది.

యోరుబా థియేటర్ – ముఖ్యులు

ఈ థియేటర్ ప్రజాదరణ పొందడానికి ఎంతో మంది కృషి చేసారు. వారిలో ముగ్గురు మాత్రం శాశ్వతంగా నైజీరియా సాహిత్యపు చరిత్రలో నిలిచిపోతారు.

హ్యూబర్ట్ ఓగుండె (Hubert Ogunde)

నైజీరియా థియేటర్ పితామహుడుగా హ్యూబర్ట్ ఓగుండె గుర్తింపు పొందారు. నైజీరియాలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ థియాట్రికల్ సంస్థను 1945లో నెలకొల్పారు, దాని పేరు “ది ఓగుండె కాన్సర్ట్ పార్టీ”. ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, థ్రోన్ ఆఫ్ గాడ్, స్ట్రైక్ అండ్ హంగర్, ది టైగెర్స్ ఎంపైర్ మరియు యోరుబా రోను ఆయన రచనలలో సుప్రసిద్ధమైనవి.

కోలా ఓగున్మోలా

యోరుబా ఫోక్ ఓపెరాను తన సొంత ఓగున్మోలా ట్రావెలింగ్ థియేటర్ ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు ఈయన. ఇఫీ ఓవో మరియు ఓముటి అప కిని ఈయన రచనలలో సుప్రసిద్ధమైనవి. హ్యూబర్ట్ రచనలలో ఉండే హాస్యానికి సంబంధించిన అంశాలకు విరుద్ధంగా స్పష్టంగా ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పేయటం కోలా ప్రత్యేకత. అంతేకాదు, కోలా ఓగున్మోలా నాటకరంగంలో నటుడుగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.

డ్యూరో లడిపో

ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నప్పటి నుండి  డ్యూరో లడిపోకు అతని సంస్కృతి పట్ల, నాటకరంగం పట్ల, ఒపేరాల పట్ల విపరీతమైన గౌరవం మరియు ఇష్టం. ఆ ఇష్టంతోనే అతను ఎంబారి ఎంబాయో క్లబ్ స్థాపించి తన దేశపు చరిత్ర, సంప్రదాయాలు, కవితలు మరియు దేశ గమనాన్ని తెలిపేలా ఒపేరాలను వ్రాసి అందరికీ తన దేశ గొప్పతనం గురించి చెప్పాడు. ఓబా మోరో, ఓబా కోసో మరియు ఓబా వాజా డ్యూరో లడిపో రాసిన ఓపెరాలు; ఇవి ఎటువంటి క్రిస్టియన్ స్ఫూర్తి లేకుండా కేవలం నైజీరియా జానపద సాహిత్యం గురించే ప్రస్తావిస్తాయి.

Comments

comments