ధైర్యంతో ముందడుగు – మనసుకి చెప్పుకోవాల్సిన సమాధానాలు

జీవితాన్నే మార్చేసే ఒక ఆలోచన, సొంతకాళ్ళ పై నిల్చోగలిగే ఒక అవకాశం, భవిష్యత్తుని పొందుపర్చగల ఒక ఒప్పందం, ఇలా ఎన్నో విషయాలు మహిళలకు తారసపడుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని చేసుంటే బాగుణ్ణు అని ఆడవారు భవిష్యత్తులో బాధపడతారు, కొందరు చేయాలా వద్దా అని మదనపడతారు, అయితే చేసి చూస్తే తప్పేముంది ధైర్యంతో ముందడుగు వేద్దాం అనుకునేవాళ్లకు చాలా సమాధానాలు మనసు నుండి, సమాజం నుండి ఎదురు అవుతాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుని ముందుకు వెళ్ళడానికి మహిళలకు ధైర్యం కావాలి, ఆ ధైర్యం వారు వెతికే సమాధానం లోనిదే అయ్యుండాలి.

ఒక వేళ నా ప్రయత్నం విఫలం అయితే ఏమి చేయాలి?

మెట్టు ఎక్కించే ఏ ప్రయత్నమైనా ముందు ఓడిపోతామేమో అనే సందేహంతోనే మొదలు అవుతుంది. దీనికి సమాధానం, ఎదురు ప్రశ్న వేసుకోవడమే. “నేను ఎందుకు ఓడిపోతాను?” ఒక వేళ ఈ భయం వెనుక ఏమైనా కారణాలు ఉంటే వాటిని తెలుసుకోండి. ఆ కారణాలకు మూలం వెతికి పట్టుకుని వాటిని సమాధానపరిస్తే మనసు ప్రశాంతమై ఆలోచన శక్తి పెరుగుతుంది, అప్పుడు తీసుకునే నిర్ణయం సఫలం అవుతుంది.

నేను దేని గురించి భయపడుతున్నాను?

ఆడవారికి భయం తక్కువ కానీ ఆలోచనలు ఎక్కువ. ఆ ఆలోచనలే భయపెడతాయి. ఉదాహరణకు, నేను బట్టల కొట్టు పెడితే ఎదురింటి పిన్ని ఏమనుకుంటారో, మన చుట్టాల వారు నవ్వుతారేమో, మా ఆయన ‘నీకు అవసరమా ఇవన్నీ’ అని అడుగుతాడేమో? అని లక్ష ఆలోచనలు. మీ భయాలని బయటకి అరిచి చూడండి, వాటిని విని మీకే నవ్వు వస్తుంది. ఎప్పుడైతే మీ భయాలు చిన్నవి అవుతాయో, అప్పుడే మీ లక్ష్యం దగ్గర అవుతుంది.

నా చర్యల వల్ల నా వాళ్ళు నిరాశ చెందుతారా?

మన సమాజ కోణంలో చూసుకుంటే, చాలా వరకు ఆడవారు ఈ ప్రశ్నకు “నిరాశ చెందుతారు” అనే సమాధానమే పొందుతారు. ఒక మహిళ తనకి చిన్నప్పటి నుండి రుద్దబడిన సామాజికతత్వాన్ని వదిలి కొత్త లోకంలోకి వెళ్లడం ఎక్కువ శాతం మందికి మింగునపడదు. ఆడవాళ్ళలో కూడా ఒక రకమైన ఇబ్బందికర భావన మెదడులో ఏర్పడుతుంది, “సమాజం నాకు ఇది నేర్పింది, ఇంట్లో వాళ్ళు ఈ కట్టుబాట్లు పెట్టారు, వీటిని దాటి స్వతంత్రంగా నేను ప్రవర్తించగలనా?” ఇలాంటి నిరసలు ఒకటే మార్గం, మీ సత్తా ఏంటో చాటి చెప్పడం, మీ నైపుణ్యం ఇది అని వివరించడం, మీ గొప్ప ఆలోచనలను అర్ధం అయ్యేలా మీ దగ్గర వారిని ఒప్పించడం.

ధైర్యంతో ముందడుగు
సృజనకు లింగభేదం ఉండదు

కుట్టు మెషిన్ పెట్టాలి అనుకునేవారు నుంచి, కోట్లకు వ్యాపారం చేయాలి అనుకునే వారి వరకు అందరికి కలిగే ప్రశ్నలు ఇవే. ధైర్యంతో ముందడుగు వేయడానికి మీరు సృష్టించుకుని సమాధానాలే ఈరోజు మీ ఆలోచనలకు పునాదులవుతాయి. కాబట్టి ఆడవారు, మీ ఆలోచనలకు పదును పెట్టండి, నాకు ఇది సరైనది అనిపించే ఏ ఆలోచనను గాలిలో దీపాన్నిచేయకండి. ఎందుకంటే, మగవారి కంటే ఆడవారికి ఓపిక ఎక్కువ, ఆ ఒక్క శక్తి చాలు మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించడానికి, మిమ్మల్ని తక్కువగా చుసిన వారికి గుణపాఠం చెప్పడానికి, నలుగురికి ఆదర్శప్రాయం అవ్వడానికి.

Source: Enuma Okoro’s blog in Create and Cultivate

Comments

comments