దరిద్రపు లమ్డికొడుకు | తుషార [Tushara] నరకయాతన
ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు, ఇద్దరు పిల్లల తల్లి. కోపాగ్ని దహించి వేస్తున్నా, ప్రశాతంగా ఉండగలిగే గుణం ఉండాలని ఏమో, ఆమెకు తుషార అని పేరు పెట్టారు ఆమె తల్లితండ్రులు.
తుషారకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు, భర్త పేరు చందు, అత్త పేరు గీత. పేర్లు చూసి ఒకరు చందమామలా చల్లగా, ఇంకొకరు భగవద్గీతలా తత్త్వం నింపుకుని ఉంటారు అనుకుంటే తప్పు. ఇద్దరికీ ఉన్మాదం అంటే ఇష్టం. మానసికంగా, శారీరకంగా మనిషిని వేదించడం అంటే సరదా – ఈ సరదా ఏంత్తో క్రూరమైన ఆలోచనలు ఉంటే తప్ప రావు.
చందు గుణవంతుడు అని భావించి కట్నం ఇచ్చి, నగలు ఇచ్చి, తుషార చేతిని వాడి చేతిలో పెడతారు తుషార తల్లితండ్రులు. అంత ప్రేమతో కూతురిని చేతికి అప్పగించిన విశ్వాసం కూడా లేదు చందుకి, పిడికెడు అన్నం కూడా పెట్టకుండా తుషార ని కొద్ది నెలల పాటు మాడ్చేసాడు.
వారిలో ఉన్మాదం ఎందుకు బయటకి వచ్చింది? తుషారని ఎందుకు ఆలా చేసారు?
మనిషి కూడా మృగమే అని తత్వవేత్తలు చెప్తారు. మృగ లక్షణాలు బయటకి రావడానికి ఇవే కారణాలు అని సరిహద్దులు ఏమి ఉండవు. చందులోని ఉన్మాదిని, గీతలోని రాక్షసిని బయటకి తీసుకువచ్చింది మాత్రం డబ్బు.
అవును, డబ్బు.
మనిషి సృష్టించుకున్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం, డబ్బు. ఆ ఆయుధం పక్కన లేకపోతే మనిషి నిద్రాహారాలు కూడా మానేస్తాడు. అత్త, భర్త డబ్బు కోసం ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని వేదించడం మొదలు పెట్టారు. తుషారని కనీసం తల్లి తండ్రుల దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు, మాట్లాడనిచ్చేవారు కాదు, చివరికి తన గది దాటనిచ్చేవారు కూడా కాదు.
వేదించి, గాయపరిచి, మానసికంగా కృంగదీసి తుషారకి జీవితం మీద ఆశని కోల్పోయేలా చేసారు. ఇంత జరుగుతున్నా ఆమె స్థైర్యం కోల్పోలేదు, ఎందుకంటే తనకి ఒకటిన్నర సంవత్సరాల బిడ్డ. ఆ బిడ్డకి పాలు ఇవ్వాలనే మాతృప్రేమ ఆమెకి స్థైర్యాన్ని ఇచ్చింది. చనిపోయేంత వరకు ఆమెకు గీత, చందు ఆహారంగా ఇచ్చింది,
పంచదార నీరు,
నానబెట్టిన బియ్యం.
అవి తీసుకునే ఆమె బిడ్డకు పాలు ఇచ్చి, శరీరానికి పోషకాలు అందక చిక్కి శల్యం అయ్యింది.
పాపం ఆమెకు ఆకలి వేసినప్పుడు, గదిలో బొద్ధింకలను, పురుగులను తినాలి అనుకుందేమో. ఆకలికి రుచి తెలియదు కదండి, అవసరం మాత్రమే తెలుస్తుంది. ఆకలికి ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా చందు, గీత పట్టించుకోకుండా ఉండడం వారిలోని ఉన్మాదానికి, రాక్షసత్వానికి, క్రూరత్వానికి నిదర్శనం.
మనసు సహకరించినా, శరీరం సహకరించాలి కదా? నానబెట్టిన బియ్యం, పంచదార నీరు తీసుకుని, తీసుకుని శరీర రుగ్మతతో తుషార తనువు చాలించింది.
తుషార చనిపోయినప్పటికీ ఆమె బరువు ఎంతో తెలుసా?
20 కేజీలు.
పోలీసులు, మీడియా వారు, పొరుగింటివాళ్ళు అస్థిపంజరానికి చర్మం అంటించినట్లు ఉన్న తుషారను చూసి చలించిపోయారు. అందరి కళ్ళలో నీరు, ఆ స్త్రీ పడిన వేదన, ఆ మాతృమూర్తి పడిన నరకం తెలిసి కోపపడని వారు లేరు, చింతించని వారు లేరు. ఇద్దరు తప్ప.
భర్త – చందు,
అత్త – గీత.
బయటకి కనిపించకపోయినా, వారి మనసులో ఉన్మాదం నవ్వు రూపంలో మెదులుతూనే ఉంటుందేమో. చందు లాంటి దరిద్రపు లమ్డికొడుకు, ఆ దరిద్రపు లమ్డికొడుకుని సమర్ధించిన తల్లి గీతకు ప్రపంచంలో ఉన్న శిక్షలు అన్నీ విధించినా సరిపోవు, కొత్తవి, క్రూరమైనవి, ఇలా చేస్తే పర్యవసానం అత్యంత భయంకరంగా ఉంటుందా అని కాళ్ళు-చేతులు వణికేవిలా ఉండాలి.
తుషార ఊర్ధ్వలోకాలలో అయినా ప్రశాంతంగా గడపాలని, ఆమె ఆత్మ జరామరణ చట్రం నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ…