చందమామ వ్యవసాయం – చంద్రుడు యొక్క స్నేహభావం
ప్రాచీన భరత ఖండమున, అన్ని రాజ్యములకు కేంద్రముగా “కరాళము” అను రాజ్యము. ఆ రాజ్యమును, ఎన్నో సంవత్సరాలు సుభిక్షంగా పాలించి, కీర్తి గడించిన రాజు నిర్వికల్పుడు. ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పటి నుండి కరాళమే కాక, ఇతర రాజ్యములతో కూడా సాన్నిహిత్యము పెంచుకుని, భరత ఖండమును ఐక్యము చేయ ప్రయత్నం చేశారు. మహాజ్ఞాని అయిన, నిర్వికల్పుని రాజ్యాన్ని ముక్కోటి దేవుళ్ళు ఎల్లప్పుడూ వీక్షిస్తూ, ఎటువంటి కష్టం రానివ్వకుండా తమ దీవెనలతో కాపాడేవారు. అటువంటి రాజ్యంలో అనుకోని సమయం, అనుకోని వార్త అందరిని విస్తుపోయేలా చేసింది – నిర్వికల్పుడు నిద్రలోనే స్వర్గం చేరుకున్నారు.
సుఖ-శాంతులు వృద్ధిచెందిన చోటనే, దురాశ కూడా వృద్ధి చెందుతుంది. అందుకు చక్కటి ఉదాహరణ నిర్వికల్పుని కుమారుడు వికల్పుడు. తండ్రి మరణించిన పిదప రాజ్యాన్ని చేజిక్కిచుకున్న వికల్పుడు, ప్రజలను వ్యర్ధమైన పనులకు వాడుకోవడం, పన్నులు పెంచడం, ఎదురు తిరిగిన వారిని విచక్షణ లేకుండా చంపివేయడం చేసేవాడు. అతని కర్కశనీతిని దేవుళ్ళు ఈసడించుకుని కరాళము వైపు చూడడం ఆపివేశారు. రాజ్యము క్రమంగా క్షీణించి, అక్రమాలను తట్టుకొనలేక ప్రజలు అష్టకష్టాలు పడేవారు, అధికశాతం ప్రజలు హింసలు తట్టుకొనలేక వలస వెళ్లిపోగా రాజ్యం ప్రజలు లేక కళతప్పింది.
దశాబ్ద కాలం గడిచినా ఆ రాజ్యంలో మార్పు రాకపోగా దుష్ట ఆలోచనలు పెరిగిపోయి, రాచరికపు వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం అయిపోయాయి. అటువంటి దురదృష్టకర సమయాన కూడా కరాళము యొక్క మేలు కోరుకునే వాడు చంద్రుడు. అందుకు కారణం సోమయ్య అనే రైతు.
తొలకరిని ప్రేమించి, భూమిని ఆరాధించే సాధారణ రైతు సోమయ్య. వికల్పుని ఆంక్షలు భరించలేక కొడుకు, కూతురు, మనవరాలు పరాయి రాజ్యం పారిపోగా ఒంటరిగా ఉంటూ, వ్యవసాయంలోనే జీవితం వెతుక్కునేవాడు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని తల్లిలా భావించి, నిత్యం శ్రమించి, తనకి బ్రతకడానికి సరిపడా ఉంచుకుని, తక్కిన ధాన్యం అంతా పన్ను కట్టడానికి, తోటి వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించేవాడు.
మంచికోరు మనస్సుకి అసుర పీడ తప్పదన్నట్టు పాలనాధికారులు సోమయ్యను కనిపించినప్పుడల్లా వేధించేవారు. ఆహారాన్ని లాక్కుని హేళన చేసేవారు, కింద పడేసి కొట్టి పైశాచిక ఆనందం పొందేవారు. సోమయ్య మాత్రం ఏనాడు వారి అధికారాన్ని, అహంకారాన్ని ఎదిరించే ప్రయత్నం చేసేవాడు కాదు. సోమయ్యకు వారు కలిగించే అంధకారంలో కూడా వెలుగు కనిపించేది, కేవలం తన జీవన విధానం వలన.
రాత్రి కూడా పొలంలో గడిపే అలవాటు ఉన్న సోమయ్యను ఎన్నో సంవత్సరాలుగా చంద్రుడు గమనించేవాడు. సోమయ్య జీవన విధానాన్ని, నీతివంతమైన జీవితాన్ని చూసి అతడి పట్ల అనన్యమైన గౌరవం, అభిమానం పెంచుకున్నాడు చంద్రుడు. రాత్రి పూట మాత్రమే సోమయ్యను చూడటం నచ్చని చంద్రుడు అప్పుడప్పుడు పగటి పూట కూడా కనిపించేవాడు. అనర్ధమని దేవుళ్ళు వారించినా వినకుండా తరుచుగా ఆకాశాన ఉండేవాడు చంద్రుడు. ఈ వింత పోకడలకు జనం ఆశ్చర్యపోగా, వారి మాటలకు అరుదుగా తల పైకి ఎత్తి తనని సోమయ్య చూడడం చంద్రుడికి ఎంతో సంతోషాన్ని కలుగజేసేది.
చంద్రుని మనుగడలో భేదం గమనించిన మంత్రి తక్షణుడు, “ఈ పరిణామం రాజ్యానికి విపత్కరమైనదేమో” అని భావించి శాస్త్రములు తెలిసిన వారిని సంప్రదించగా ఫలితం లేకపోయింది. మునులు, మహర్షులు, కరాళమును పాపపు రాజ్యముగా భావించి వెళ్లిపోయిన కారణంగా దిక్కులేక తాంత్రిక విద్యలు తెలిసిన వారిని ఆశ్రయించాడు. వారు తమ శక్తిని ఉపయోగించి “చంద్రుని వశం చేసుకున్న వాడు తూర్పు కనుమల దగ్గర దొరుకుతాడు,” అని చెప్పగా మంత్రి తూర్పు కనుమల దగ్గర విస్తరించిన కరాళ రాజ్యమంతటా వెతకమని రాజ భక్తులని పురమాయిస్తాడు.
రాజ భటులు సక్రమంగా, అక్రమంగా ఎంత వెతికినా కారకులు ఎవరో వారికి తెలియరాదు. దొరకలేదు అని తిరిగి వెళితే దండన తప్పదని భయంతో ఎన్నో మాసాలు వారు ప్రయత్నం ఆపకుండా వారు తూర్పు కనుమలలో గాలించారు. తిండి, నిద్ర, విరామం సరిగా లేకపోవడంతో వారిలో చాలా మంది జీవచ్ఛవాలను తలపించారు సోమయ్యకు. వారికి తనకున్నంతలో ఆహరం వండి పెట్టి ఆదుకునేవాడు. రాజ భటుల సాన్నిధ్యం మంచిది కాదు అని సోమయ్యను శ్రేయోభిలాషులు వారించినా, అతను సహాయం మాత్రం ఆపేవాడు కాదు. “చేతికి సహాయం చేయడం వస్తే, కనులను కూడా ధానమిస్తుంది”, అని అందుకే అంటారేమో.
భటులకు సేవ చేసే ప్రయత్నంలో సోమయ్య ఆరోగ్యం పట్టించుకోకుండా నిరంతరం పని చేసేవాడు. పొలంలో పని చేసి, ఇంటికి రాగానే భటులకు వండి వార్చి, సరైన నిద్ర లేకుండా మొదట భటులు ఎలా జీవచ్చవంలా ఉన్నారో, అలా తయారు అయ్యాడు. అలా ఒకానొక రోజు పొలంలో పని చేయడానికి వెళ్లగా నీరసంతో నాగలి పక్కనే స్పృహతప్పి పడిపోతాడు సోమయ్య.
సొమ్మసిల్లిపోయిన సోమయ్యను చూసి ఆకాశం నుండి వెండి వర్ణములతో విరాజిల్లుతున్న కాంతి పుంజంలా భువికి చేరుకుంటాడు చంద్రుడు. సోమయ్యని పొలంలోనున్న వేప చెట్టు క్రింద సేదతీరడానికి పడుకోబెట్టి విష సర్పాలు, కీటకాలు హాని చేయకుండా అర్ధపారదర్శకత కలిగియున్న కాంతి వలయాన్ని తన శక్తిచే ఏర్పరుస్తాడు చంద్రుడు.
సోమయ్య సేద తీరుతున్న సమయం అంతా చంద్రుడు భూమాతకు నమస్కరించి వ్యవసాయం చేసేవాడు. తన శక్తిచే ధాన్యం ఎన్ని బస్తాలు అయినా ప్రసాదించగల చంద్రుడు, సోమయ్య చేసే పని ఎలా ఉంటుందో తెలుసుకోడానికి సోమయ్యలా పొలం పనులు చేసేవాడు. అవసరం అయినప్పుడల్లా వరుణ దేవుని ప్రసన్నం చేసుకుని భూమిని తడుపుతూ, జాగ్రత్తగా అంత చూసాడు. ఒక్క పూట అలా చేయగానే, చంద్రుడు కుతూహలంతో భూదేవిని ఒక ప్రశ్న అడుగుతాడు:
“తల్లి, నాగలితో నిన్ను చీల్చడం మనిషి చేసే పని. అయిననూ మనిషికి నీవు సుభిక్షతను ప్రసాదిస్తావు, ఏలనమ్మా అలా చేస్తావు?” ఆ ప్రశ్న వినగానే భూదేవి విత్తు లో నుంచి మొలకెత్తి చంద్రుని ఆశీర్వదిస్తూ ఇట్లనెను “నాగలితో నా శరీరాన్ని చీల్చడం, ఆకలి తీర్చు పాల కోసం బిడ్డడు రొమ్ముని గట్టిగా కొరకడంతో సమానం నాయనా. ఏ తల్లికి ఆ నొప్పి బాధను కలుగజేయదు”. ఆ మాట వినగానే చంద్రుడు ఆమెకు నమస్కరించగా, ఆమె మరల విత్తులోకే వెళ్ళిపోయింది. భూమాత జవాబు వినగానే చంద్రుడికి కుతూహలం కలిగింది – “అయ్యో చంద్రమండలం కూడా మనుషులకి నివాస యోగ్యం అయుంటే కలకాలం వారిని కాపాడుతూ, వారి ఆలోచనలకూ అబ్బురపడుతూ ఉండేవాడిని కదా!”
చంద్రుడు ఆలోచనల కొలనులో మీనమై సంచరిస్తుండగా సోమయ్య నెమ్మదిగా కదులుతాడు. చంద్రుడు అప్రమత్తమై, కాంతి వలయాన్ని తొలగించి, కాంతి పుంజమై ఉన్న ఆయన, గాలిలో విలీనమై అదృశ్యం అయిపోతాడు. సోమయ్య తేరుకోగా తన రుగ్మతలు అన్ని తొలగి, పునరుత్తేజితుడు అయినట్లు అనిపిస్తుంది. పొలం వైపు చూడగా, తాను చేయవలసిన పని పూర్తి అయుంటుంది, తానే చేసానేమో అని అతనికి భ్రమ కలిగి సంతోషంతో ఇంటి ముఖం పడతాడు.
సూర్యోదయంతో మరల తన జీవన శైలిని కొనసాగిస్తాడు సోమయ్య. అప్పుడప్పుడు రాత్రి పూటలు చంద్రుడు సహాయం చేయడం, వ్యవసాయం చేయడం కూడా జరుగుతుండేది. రాజ భటులు సోమయ్యను దేవునిలా భావించేవారు. దేవుని పట్లయినా అసూయ చూపగలిగే మనిషి, సాటి మనిషిని దేవుడు అంటే చూడగలరా? ఆ అసూయతోనే పరిపాలన అధికారులు సోమయ్యను ఏదోక విధంగా ఇరుకునపెడతాం అని పన్నాగం పన్నుతారు. కానీ సోమయ్యను దోషిగా చూపడానికి వారికి ఏ మార్గము దొరకదు, ఇదిలా ఉండగా ఒక రోజు రాత్రి పూట పొలం వైపు వెళ్లడం చూసి ఆ ఇరువురు అధికారులు సోమయ్యను చంపివేద్దాం అని నిశ్చయించుకుంటారు. కొడవళ్లు చేత పట్టుకుని అధికారులు అంధకారాన్ని లోబడి దారి దొంగల వలె మారగా, వారు సోమయ్య పొలం వద్ద అతని తిరుగు రాక కోసం పొదల వెనుక నక్కి చూడసాగారు.
కాసేపటికి వారి కనులలో ఆశ్చర్యం, సోమయ్యను నిద్రలోకి జార్చి ఒక కాంతి పుంజం పొలంలో తిరుగుతూ చిమ్మ చీకటిని వెన్నెలమయం చేస్తుంది. తమ ముందే దేవుని లీల ఆచరణలో ఉందని గమనించని వారు, సోమయ్యను మట్టుపెట్టేందుకు అదొక అవకాశమని భావించి అక్కడ నుంచి నెమ్మదిగా నిష్క్రమిస్తారు. తెల్లవారగానే వారు రాజ భటులకు వారు చూసినది చెప్తారు. సోమయ్య దయాగుణం, వారికి చేసిన సహాయం మరచిపోయి వారు అందరు పరిపాలన అధికారుల మాట విని ఏ రోజు సోమయ్య మరల రాత్రి పొలం వైపు వెళ్తాడో ఆ రోజు అతడ్ని వెంబడించి చంద్రుడ్ని ప్రసన్నం చేసుకుంటున్నపుడే పట్టుకుందాం అని వారిలో వారు మాట్లాడుకుంటారు.
దుర్బుద్ధి గలవారికి సచ్ఛీలము దుర్జనుని లక్షణం వలె కనిపించును అన్నట్టు వారికి సోమయ్య దుష్టునిగా, ఇన్ని రోజులు రాజ్యం వదిలి బయట నివసించుటకు కారణంగా కనిపించాడు. వికల్పుని సన్నిధిలో మసలే రాజ భటులు రాజు తత్వాన్ని ఉనికి పుచ్చుకున్నట్టు, సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఆ తరుణం రానే వచ్చింది, పున్నమి నాడు సోమయ్య పొలం వైపు వెళ్లగా కవచములు ధరించి, డాలు బల్లెములు చేతబట్టి, అలికిడి లేకుండా తూర్పు కనుమలలోనున్న సోమయ్య పొలం వైపు వెళ్ళసాగారు.
వారు వెళ్లే సమయానికి కాంతి వలయాన్ని తొలగించి చంద్రుని కాంతి పుంజం గాలిలో కలిసిపోతుంది. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసినా కూడా వారి ఆలోచనలో మార్పు రాకపోగా, తేరుకుంటున్న సోమయ్యను వేప చెట్టు వద్దనుండి ఈడ్చి సమీపాన ఉన్న రాళ్ల గుట్టమీద పడేస్తారు. నిర్ఘాంతపోయి సోమయ్య “నాయనలారా ఏమైంది? నేను ఏమి చేశాను?” అని ప్రశ్నించగా, వారు సమాధానం ఇవ్వకపోగా సోమయ్యను నానారకములుగా హింసించి రెండు కర్రలకు కట్టివేసి రాజ్యానికి తీసుకువెళతారు. పరిపాలన అధికారులు తమ ద్వేషం చల్లారిందని తృప్తితో ఇంటిబాట పడతారు, దారిలో వారిని మహా వృక్షమంతటి కొండచిలువ వచ్చి మింగేస్తుంది.
కరాళము యొక్క కోటలోకి సోమయ్యను తీసుకువెళతారు రాజభటులు. కర్రకి వేలాడదీసినపుడు సోమయ్యకు ఒకటే ఆలోచన – “వీరి శ్రేయస్సు కోరి నేను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను, అలాంటి వీరే నా ప్రాణం కోరుతున్నారు. అల్పబుధ్ధితో సకలజన సౌఖ్యాన్ని కోరుకోవడం నా తప్పే ఏమో? మంచికి కూడా విచక్షణ అవసరం అని మరిచాను”. మెదడులో అసంఖ్యాకమైన ఆలోచనలు నాట్యమాడుతుండగా సోమయ్య తనకు తెలియకుండానే వికల్పుని సమక్షాన దోషిగా నిలబెడబడతారు.
వికల్పుని కొలువులో అధికారులు తప్ప ప్రజలు లేరు.
మద్యముచే వెలువడు వాసన సోమయ్య నాసికలోకి చొరబడి, ఆ వాసనను అప్రయత్నపూర్వకంగా చీదరించుకుని తన ఆలోచనలనుండి బయటకి వస్తాడు. తన విధిని ఎదిరించే శక్తిలేక మౌనముగా నిలుచుని తన మీద పడ్డ నిందలు వింటున్నాడు సోమయ్య. “దైవ ధిక్కారం చేయువాడు”, “క్షుద్ర మాంత్రికుడు”, “హంతకుడు”, “నర రూప రాక్షసుడు”, “రక్త పిపాసి” ఇలాంటి అభియోగాలు ఎన్నో సోమయ్య చెవిన పడ్డాయి, కానీ తానూ ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది అతనికి.
తన మీద పడ్డ అభియోగాలను తప్పు అని రుజువు చేయడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మంత్రి సోమయ్యను ప్రశ్నించగా, సోమయ్య – “నేను చేసిన తప్పు ఏమిటో నాకు ఎవరైనా చెప్తే వింటాను సామి!” అని బదులు ఇస్తాడు. మంత్రి ఆగ్రహంతో – “ఇంతవరకు మేము చర్చించింది దాని గురించే కదా? చంద్రుని అసాధారణ ఉనికికి కారణం నీవేనని తమ కనులతో చూసి సాక్ష్యం చెప్పారు రాజ భటులు, అంచేత నీకు మరణ శిక్ష విధించడమైనది.” ఆ కారణం వినగానే సోమయ్యకు తాను ఉన్న చోట ఉండాల్సింది ఇంకెవరైనా ఏమో, వారు దొరకక తనని బంధించారు అనిపించింది.
సోమయ్య “నాకు పాత్రమగు శిక్ష కాదు కదా ఇది? ముక్కోటి దైవముల సాక్షిగా నేను ఈ తప్పు చేసి ఎరుగను. నా బుద్ధికెరుక లేక ఏమైనా తప్పు చేసి ఉంటే నేను ఈ శిక్షకు పాత్రుడనే, విసిగి వేసారిన ఈ రైతు అనుభవించినది చాలు. నేను నిర్మల హృదయంతో బ్రతికియుంటే స్వర్గ ద్వారములు శాంతిని ప్రసాదించుటకు నా కొరకు తెరిచియుంటాయి, లేదా…” సోమయ్య మాటలు పూర్తి చేసేలోపు అతని శరీరమంతా కాంతితో నిండిపోగా, అతను, అతనితో పాటు సభలో ఉన్న వారు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. సోమయ్య నుండి వెలువడిన వెలుతురు అతనిలో నుండి వేరు అయ్యి క్రమంగా రూపం దాలుస్తుంది. మంత్రి తక్షణుడు చంద్రభగవానుడే దర్శనం ఇచ్చారని ప్రణమిల్లాగా, వికల్పుడు మాత్రం అహంకారంతో తన సింహాసనము విడిచి నిలబడడు.
ఇంతలో భూమి కంపించి వేయిలతల పూపరిమళాలతో భూదేవి ప్రత్యక్షం అవుతుంది. వికల్పుని కోటను చీల్చుకుని పదునైన కాంతి కిరణం కొలువులోకి ప్రవేశించి క్రమంగా ఆ కాంతి సూర్యునివలె మారిపోతుంది. వారి రాకతో తక్కిన దైవములంతా కరాళము యొక్క కొలువులో ప్రత్యక్షమవుతారు. వారి రాకతోనే కృతజ్ఞత చూపని రాజభటులు, కుటిల బుద్దితో రాజ్యాన్ని నాశనం చేసిన వికల్పుని పరివారం భస్మం అయిపోగా మంత్రి తక్షణుడు, వికల్పుడు మాత్రమే కొలనులో మిగులుతారు. తక్కిన స్థానాలలో దేవలోకం నుండి వచ్చిన వారు ఆశీనులు కాగా, దుర్గంధం అంతా మాయమై, చీకటి పోయి ఆ రాజ ఆస్థానము ఇంద్రలోకాన్ని తలపిస్తుంది.
భస్మమైన తన పరివారాన్ని చూసి వికల్పుడు భయంతో వణికిపోతూ తన సింహాసనం నుండి లేచి అందరికి నమస్కరిస్తాడు. అతడ్ని చూసి చంద్రుడు – “పాపాత్ములలోకెల్ల పాపాత్ముడివి నీవు, వికల్ప రాజా చీకటి వెలుగుల విచక్షణ మరిచి నీవు నీ తండ్రి అయిన నిర్వికల్పుని పేరు, ఆయనచే కాయబడిన ఈ కరాళము యొక్క పేరు నిర్ద్వందముగా నాశనము చేసావు. నిర్వికల్పుని యొక్క దైవాంశ నీలో మిగిలి ఉన్నందున నిన్ను భస్మము చేయుటకు సందేహించితిమి.” సోమయ్యకు ఇదంతా భ్రాంతిలా అనిపించి సురులు తన మేలు కోరి ఎందుకు వచ్చారో తెలియక చేతులు జోడించి మౌనముగా నిలుచుంటాడు.
చంద్రుని మాటలు పూర్తి అవ్వగానే తక్షణుడు కలుగజేసుకుని, “చీకటిని తొలగించు చంద్రుడవు నీవు, నీ ఆగ్రహము లోకానికే కీడు స్వామి. వికల్పుడు పసివాడు, రాజ్య సంరక్షణ, ప్రజా పరిపాలన గూర్చి ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉంది. దయచేసి నిర్వికల్పుని కుమారుడని మన్నించండి.”
తక్షణుడి మాటలు విన్న సూర్యుడు ఈ విధంగా పలికెను “మంత్రి, నీవన్నట్టు వికల్పుడు పొరపాట్లు చేసిన మేము తప్పక మన్నించేవాళ్ళం, కానీ అతడు అహంకారంతో, రాజ్యాధికారం ఉందనే కావరంతో దుష్టులను చేరదీసి భరత ఖండమునకే అపకీర్తి తీసుకొచ్చినాడు. కాదనగలవా?”
నిజమని తెలిసినా వికల్పుని మీద అభిమానంతో మంత్రి, “స్వామి సకలచరముల గతిని శాసించే మీకు తెలియనిదా? చెద కట్టిన కోటలోనే కదా సర్పము నిలయమగుదును, అటులనే కష్టపడి నిర్మించిన ఈ రాజ్యానికి నిర్వికల్పుని మరణంతో ఎన్నో సర్పములు వచ్చి చేరినవి. వాటి ప్రభావం వికల్పుని మీద పడినదే తప్ప స్వతహాగా అతడు నిర్వికల్పుని అంశను అందిపుచ్చుకున్న వాడు”, అని పలికి రాజుని సమర్దించెను.
తక్షణుడి మాటలు విన్న భూదేవి ఈ విధంగా పలికెను “తక్షణుడా, మంత్రిగా నీ ప్రయత్నం ప్రశంసనీయం. నీ మాటలలో నిజము ఉందని మమ్మల్ని నమ్మమని అర్ధిస్తున్నావు. సరే! వికల్పునికి ఒక్క అవకాశం ఇస్తున్నాము. నేను అనగా భూదేవి, ఆయన సూర్య భగవానుడు, అయన చంద్ర భగవానుడు – మా ముగ్గురిని వికల్పుడు ఒక్కో కోరిక కోరుకోవాలి. అవి సమంజసమైన, నీతివంతమైన కోరికలు అయితే వాటిని మేము ప్రసాదించి కరాళము వదిలి వెళ్ళిపోయెదము. అసమంజసమైనవి అయితే, రాజాశనం మీద ఆసీనులు అయ్యున్న దేవేంద్రుడు తన వజ్రాయుధంతో వికల్పుని శిరస్సు ఖండించెదరు. ఓ మంత్రి, మీ రాజు స్వచ్ఛమనస్కుడే అయితే కోరికలను కోరుకొనమని తెలుపుము.”
రైతుకి క్షమాపణ చెప్పమనగానే బెణుకు పోయి అహం బయటకి వచ్చినవాడై వికల్పుడు తక్షణుడి వైపు కోపంగా చూసి, “భూమిని బిక్షం అడుక్కుని బ్రతికే రైతుకి తూర్పు కనుమలనుండి పడమర వేసంగి నది వరకు పాలించే ఈ వికల్పుడు క్షమాపణలు చెప్పాలా? ఆత్మాభిమానమున అంబరాన్ని అంటే మేము ఏమి చేయాలో మాకు తెలుసు, మీ సహాయానికి ధన్యవాదములు మంత్రి”, అని పలికి సోమయ్యతో పాటు నిలుచున్న భూదేవి, సూర్యుడు, చంద్రుడు వద్దకు వెళ్లెను వికల్పుడు.
వికల్పుడు సురుల వద్దకు వెళ్లి,
“భూదేవి భూమి మీద జీవించే జీవులన్నిటి మీద నాకు ఆధిపత్యం కావాలి,
సూర్యదేవా నీకు వలె అపరిమితమైన శక్తి నాలో నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి,
చంద్రభగవానుడా భూమి చుట్టూ నీ సంచారం ఉన్నన్ని నాళ్ళు నాకు సంపూర్ణ ఆరోగ్యంతో, యవ్వనంతో ఉండే జీవితం ప్రసాదించు.
ఇవే నా కోరికలు, నా కొలువుకి అనుమతి లేకుండా వచ్చినందుకు మీరు నాకు ఇవ్వవలసిన సుంకం ఇది. మీ బాధ్యతగా ఇచ్చేసి వెళ్ళండి.” అతని కోరికలు విన్న సోమయ్యకు నవ్వు వచ్చింది, ఆపుకోలేక నవ్వగా అతని నవ్వు చూసి దేవగణం అంతా నవ్వనారంభించారు. అది చూసి తట్టుకోలేక వికల్పుడు ఖడ్గం తీసి సోమయ్యను హతమార్చడానికి ప్రయత్నించగా దేవేంద్రుడు తన వజ్రాయుధంతో వికల్పుని తునాతునకలు చేసివేస్తాడు.
సోమయ్య కృతజ్ఞతతో దేవేంద్రుడికి నమస్కరించగా, భూదేవి తక్షణుడిని ఉద్దేశించి మాట్లాడుతుంది – ” నీవు చెప్పిన పసిహృదయం వికల్పునిలో లేదు మంత్రి. కుళ్ళు, కల్మషం, ద్వేషం, గర్వం నిండి ఎదుట ఉన్న వారు ఎంతటి వారో కూడా ఎరుగక ప్రవర్తించాడు. అతను తప్పక శిక్షార్హుడే, అతని కోసం సోమయ్యను దోషిగా భావించిన నీవు కూడా శిక్షార్హుడవే, నీకునూ అదే అవకాశం ఇస్తున్నాము సరైన కోరికలు అడిగిన నీకు మరణం నుండి ఉపశమనం కలుగుతుంది లేదా వికల్పునితో పాటు నీవు కూడా నరక కూపంలో పడి శాశ్వతముగా చిత్రవధ అనుభవించెదవు.”
చతికిలబడిపోయిన తక్షణుడు అతి కష్టంమీద నిలబడి ఇట్లనెను – “తల్లి, ప్రాణం మీద ఆశ నాకు ఎలాగో లేదు, కానీ నిర్వికల్పుని చావునుండి నరకంలోనే బ్రతుకుతున్న నేను ఇక నరకమున బ్రతకాలి అనుకోవట్లేదు. ఇక సోమయ్య విషయానికి వస్తే, రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నంలో భాగం. సాక్ష్యాలను బట్టి అతను చంద్రుని వశం చేసుకుని కీడు చేస్తాడు అనుకున్నానే తప్ప, చంద్ర భగవానుడి రాకతో కరాళము దీవింపబడుతుంది అని భావించలేదు. బహుశా గాఢాంధకారముతో సహవాసం చేయడం వలన అది నా బుద్ధిని కాటు వేసి ఉండొచ్చు. సోమయ్య తరపున దేవలోకం నిలబడినప్పుడే నా తప్పు అర్ధం అయింది.”
సోమయ్య దగ్గరకు వచ్చి “సోమయ్య, నా వలన కలిగిన ఇబ్బందులకు క్షమించు, నీ వల్లనే అసంఖ్యాకమైన దేవతలు, దేవుళ్ళు కరాళము కొలువులో ఆసీనులయ్యారు. తద్వారా పాపపు కూపంగా మారిన ఈ రాజ్యము ప్రక్షాళన పొంది మరల పునర్వైభవమును సంతరించుకొనునని నా నమ్మకం.” తక్షణుడు క్షమాపణలు చెప్పడంతో సోమయ్య ఆయన వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని క్షమిస్తున్నందుకు అంగీకారముగా తక్షణుడి చేతులు కదిపి చిరునవ్వుతో పలకరిస్తాడు. అక్కడ నుంచి ముందుకి వచ్చి తక్షణుడు సభను ఉద్దేశించి ఇట్లనెను – “నావి కోరికలు కాక, ప్రశ్నలకు సమాధానములుగా స్వీకరించమని మనవి.
భూమాత నీ నుండి కోరుకోవల్సింది సుభిక్షత,
దినకరా నీ నుండి కోరుకోవల్సింది స్థిరమైన, క్రమశిక్షణ గల పాలనా సామర్థ్యం,
చంద్రుడా నీ నుండి కోరుకోవల్సింది ప్రజల పట్ల సమభావం, వెన్నెల వంటి నిర్మల స్వభావం.
ఒక రాజుగా వికల్పుడు అడగవలసిన కోరికలు ఇవే అని నా భావన, కానియెడల వజ్రాయుధంచే నన్ను ఛేదించండి.”
తక్షణుడి మాటలు విన్న వారు అందరూ అతని జ్ఞానమునకు మెచ్చుకొనగా, దేవేంద్రుడు సింహాసనం నుండి లేసి “తక్షణ నీవు ఆదర్శమూర్తివి, కరాళము నీకు అప్పజెప్తున్నాను, నీ పాలనలో ఈ రాజ్యం మరల భారత ఖండమున ఉత్తమమైనది కాగలదు.” దేవేంద్రుని మాటలు వినగానే తక్షణుడు “క్షమించండి మహేంద్ర, రాజ్యము పట్ల కానీ, అధికారము పట్ల కానీ నాకు ఆసక్తి లేదు.”
తక్షణుడు రాజ్యాధికారం తిరస్కరించడంతో దేవేంద్రుడికి ఏమి చేయాలో తెలియలేదు, తర్వాత అర్హత మంచికి ప్రతిబింబం అయిన సోమయ్యకే ఉందని భావించి అతడ్ని రాజు అవ్వమనగా, సోమయ్య సున్నితంగా, “ఓ ఇంద్రభగవానుడా నాకు భూమిని ప్రేమించడమే తప్ప, ప్రజలని పాలించడం తెలియదు. పాలన పట్ల ప్రజ్ఞ లేనటువంటి నాకు రాజ్యము ఇచ్చినా అది క్షీణగతి పొందును.”
చంద్రుడు కలుగజేసుకుని “దేవేంద్ర, కరాళము భారత ఖండము యొక్క ప్రధాన రాజ్యము. అది తక్షణుడి చేతిలోనే సంవృద్ధి చెందుతుంది. జ్ఞానము, ప్రజ్ఞ ఉన్న మంత్రి తన జీవిత కాలం కరాళమును పాలించి, అర్హుడైన వారిని ఎన్నుకుని స్వర్గ ప్రాప్తి పొందుటయే ఉత్తమ మార్గము, అతనిలో నిగూఢమైన చీకటిని తొలగించు ఉపాయము. తక్షణుడా ఇంద్రలోకపు నిర్ణయాన్ని కాదనక రాజ్యాధికారాన్ని చేపట్టు, అంతా మంచే జరుగుతుంది.” చంద్రుడి మాటలు విని కాసేపు అలోచించి అంగీకారము తెలుపుతాడు తక్షణుడు.
చంద్రుడు సోమయ్య వద్దకు వెళ్లి “మిత్రమా, తెలిసో తెలియకో నా వల్ల నీకు ఆపద కలిగింది, తప్పు నాది కూడా ఉంది. అందుకు ప్రక్షాళనగా నిన్ను చంద్రమండలం తీసుకుపోయి నిన్ను శాశ్వతంగా నా ప్రాణ మిత్రునిగా చేసుకుందాము అనుకుంటున్నాను. నీకు సమ్మతమేనా?”
సోమయ్య మిత్రమా అను మాట విని కనులు చెమ్మగిల్లగా “స్వామి, కలలోనైనా మీ వంటి మహాపురుషుల దర్శన భాగ్యం పొందలేని నా వంటి అల్పుడికి మిత్రుని స్థానం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు. కానీ దేవా, నాకు వ్యవసాయం, సహాయం తప్ప ఏమి తెలియదు, నేను చంద్ర మండలం వచ్చి ఏమి చేయగలను?”
ప్రతిగా చంద్రుడు, “ఎన్నో ఎత్తు పల్లాలతో నిండిపోయుంది చంద్ర మండలం. ఓ రైతు వచ్చి సహాయంగా వాటిని చదును చేసి వ్యవసాయం చేస్తే చూడాలని ఉంది మిత్రమా, నీకు తెలిసిన పనే, మరి వస్తావా?” అని నవ్వుతూ పలుకగా సోమయ్య తనపై ఉన్న ప్రేమకు అభిమానానికి తడిసి చంద్రుని ఆలింగనం చేసుకుంటాడు. తక్కిన సురులందరూ సంతోషముతో వారిని ఆశిర్వదించగా వారిరువురూ కాంతి పుంజంలా మారి చంద్ర మండలం చేరుకుంటారు.
సోమయ్య, చంద్రుడు చంద్ర మండలాన్ని చక్కదిద్దే పనుల్లో మునిగిపోతారు. క్రమంగా చంద్రుడు సోమయ్య వంటి ఉత్తమ గుణాలు గల వారిని చంద్ర మండలంలో స్థానం ఇవ్వడం మొదలుపెడతాడు. అంచేతనే చంద్రుడు పగటి పూట కనిపించడం సాధారణం అయిపోయింది, అదే కాక సోమయ్య ఆధ్వర్యంలో సుగుణులు అందరూ చదును చేసే కార్యక్రమం మొదలు పెట్టగా ప్రస్తుతానికి కొంచం చదును అయ్యి చంద్ర మండలం మీద “ఆ” అనే ఆకారంలో మాత్రమే ఎత్తు పల్లాలు మిగిలాయి. అవే ప్రజానీకం రోజూ వీక్షిస్తారు, సోమయ్య లాంటి మంచి గుణం ఉన్న వ్యక్తులు అధికం అయితే కలి యుగ అంతంలోపు చంద్రమండలం చదును అయిపోయి, చంద్రుడు వ్యవసాయం పునఃప్రారంభం చేద్దాం అని ఎదురు చూస్తున్నాడు, సోమయ్య పక్కన కూర్చుని.
©సాహిత్యలోకం