V for Vendetta [2005] – నవ విప్లవ స్పూర్తి

దేశం కోసం ఏం చేస్తారు? అనాధ పిల్లలని దత్తతు తీసుకుంటారా? ధన సహాయం చేస్తారా? ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయగలరా? వీటన్నిటికి అందని స్థాయిలో దేశాన్ని కాపాడడానికి తీవ్రవాది అవ్వగలరా? ఎవ్వరూ చేయలేని సాహసం చేయగలరా? అధికారాన్ని చేతులోకి తీసుకుని సమాజాన్ని మార్చగలరా? ఇటువంటి విపరీత ఆలోచనలకు కళను చేకూర్చి, చరిత్రను జోడించి, ప్రతి తరం వారికి స్పూర్తినందించేలా తీసిన చిత్రం – V for Vendetta.


కథ


“Remember, remember the 5th of November. The gunpowder treason and plot”


కథానాయకి Evey Hammond పై వాక్యం పలకడంతో చిత్రం మొదలు అవుతుంది. ఆమె మాట్లాడుతుంటే Guy Fawkes అనే వ్యక్తి చేసిన పనులు సన్నివేశాలుగా కనిపిస్తాయి.


November, 5, 1605 – Guy Fawkes బ్రిటిష్ పార్లమెంట్ ని పేల్చేయడానికి ప్రయత్నిస్తాడు, అతని ప్రయత్నం ఫలించదు కానీ ఆయన చర్య చరిత్రలో నిలిచిపోతుంది. పార్లమెంట్ పేల్చేయడం లాంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని జనం మధ్యలో ఉరి తీస్తారు. అతన్ని ఉరి తీసే తరుణంలో Evey Hammond వాయిస్ ఓవర్ తో “ఆలోచనలు” గురించి వివరిస్తుంది.


“ఒక ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు, ఆలోచనల శక్తిని ప్రభావాన్ని నేను ప్రత్యక్షంగా చూసాను, ఆలోచనల పేరుతో మనుషులు చంపడం చూసాను, వాటిని సమర్ధించుకోవడానికి చనిపోయిన వాళ్ళని చూసాను!!! కానీ నువ్వు ఆలోచనని ముద్దు పెట్టుకోలేవు, ముట్టుకోలేవు, పట్టుకోలేవు… ఆలోచనలు రక్తం చిందించవు, వాటికి నొప్పి తెలియదు, ఆలోచనలు ప్రేమించవు, కానీ నేను ఆలోచనల్ని కోల్పోయినందుకు బాధపడట్లేదు, ఆ ఆలోచనల వెనుక ఉన్న మనిషిని కోల్పోయినందుకు బాధపడుతున్నాను.”


ఇక్కడ నుండి అసలు కథ ప్రారంభం అవుతుంది, స్క్రీన్ ప్లే ని పక్కన పెడితే – లండన్ లో Larkhill Detention Centre అనే ప్రయోగశాలలో మనుషుల మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. దాని కారణంగా చాలా మంది చనిపోగా ఒక్క వ్యక్తి మాత్రం ప్రయోగాలన్నిటికి తట్టుకుని బతుకుతాడు. అతని రక్తం లో ప్రాణాంతకమైన వైరస్ ని ఎదుర్కునే సామర్థ్యం ఉంటుంది. November 5 న ఆ ప్రయోగశాలలో అగ్ని ప్రమాదం జరిగి ఆ వ్యక్తి మరియు ఆ ప్రయోగశాల నడుపుతున్న వారు కొందరు మాత్రమే బతుకుతారు. ఆ వ్యక్తి దేహం పూర్తిగా కాలిపోయి చర్మం కరిగిపోయినా నొప్పిని తట్టుకుని మంటలలో నుండి బయటకి వచ్చేస్తాడు.


అది జరిగిన తర్వాత లండన్ లో భయంకరమైన వైరస్ వ్యాప్తి చెంది పైగా ప్రజలు చనిపోతారు. ఆ వైరస్ కి విరుగుడు తన దగ్గర ఉందంటూ Conservative partyకి చెందిన Lewis Prothero అనే వ్యక్తి, ఔషదాలు తయారు చేసే సంస్థ యజమాని తెలియజేస్తాడు. జనాలు అందరూ ప్రాణహాని నుండి బయటపడతారు. ఆ సంవత్సరం ఎన్నికలలో Conservative party ఘన విజయం సాధిస్తుంది. ఆ పార్టీకి చెందిన Adam Sutler, High Chancellorగా నియమించబడతాడు.


ప్రజల రక్షణ కోసం అని కొత్త విధానాలు ప్రవేశపెడతారు – స్వలింగ సంపర్కుల నిషేధం, ఇతర మతాలు నిషేధం, రాత్రి పదకొండు దాటితే బయటకి రాకూడదు, లండన్ లో కొన్ని ప్రదేశాలు మాత్రమే ప్రజలు తిరగాలి, ప్రజల రక్షణ కోసం విధించిన వారిని ఎదిరించకూడదు, ఇతర దేశాలతో సంబంధం పెట్టుకోకూడదు. ఇలాంటి నిబంధనలు అమలు చేయడం వలన Adam Sutler ఒక నియంతలా అవతరిస్తాడు.


ప్రజలు ప్రభుత్వానికి భయపడకూడదు,
ప్రభుత్వమే ప్రజలకి భయపడాలి…
ఈ నినాదంతో, ఒక నియంత ఆలోచనలకి బలి అయిన వ్యక్తి తీవ్రవాదిగా మారి ప్రజల్ని ఎలా మార్చాడు అనేది కథ. [పైన చెప్పిన కథ కన్నా చిత్రంలో జరిగే కథ బిన్నంగా ఉంటుంది – తీవ్రవాదిలా మారినప్పటి నుండి ప్రయాణం మొదలు అవుతుంది].


ఈ చిత్రంలో కథానాయకుడికి పేరు ఉండదు, మోహము ఉండదు, ముసుగు వేసుకుని ఉంటాడు ప్రతి నిముషం. V for Vendetta ప్రతీకారం గురించే అయినా, కథానాయకుడు V ఎక్కడా ప్రతీకారమే తన అంతిమ లక్ష్యంలా వ్యవహరించడు. అగ్ని ప్రమాదం వలన తానూ ఎలా విముక్తుడయ్యాడో, తన చర్యల వల్ల ప్రజలు ప్రభుత్వం నుండి విముక్తి చెందాలి అని భావిస్తాడు.

V for Vendetta in telugu


V for Vendetta లో మర్చిపోలేని సన్నివేశాలు

> TV ప్రసారం ద్వారా V ప్రజలకి ఇచ్చే సందేశం.
> Evey Hammond భయాన్ని పోగొట్టడానికి V ఎంచుకునే విధానం.
> పార్లమెంట్ ని పేల్చే నిర్ణయాన్ని తీవ్రమైన ఆలోచనలతో ఉన్న V తన నుండి Evey Hammond కి వదిలేసి వెళ్లిపోయే సన్నివేశం.

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఒకదానికి ఒకటి ముడిపడి ఉండి, విడదీయలేని విధంగా ఉంటుంది. కాబట్టి చిత్రం చూసే వారికి దాదాపుగా చిత్రం మొత్తం గుర్తుండిపోతుంది.

చివరిగా

చతురత, ఆలోచన, విప్లవం వంటి అంశాలను ఎంతో కళాత్మకంగా తెరకెక్కించారు James McTeigue. V for Vendetta గ్రాఫిక్ నవల ఆధారంగా తీసినా, అందులోని ఆలోచనలను సన్నివేశాలుగా చిత్రీకరించడంలో ఆయన విజయం సాధించారు. నేపధ్య సంగీతం, నటన, చరమాంకం అద్భుతంగా ఉండడంతో V for Vendetta తరతరాలకు స్పూర్తినిచ్చే చిత్రంగా నిలిచిపోయింది.

Comments

comments