దోమతో ముఖాముఖి

మశకము, చీకటీగ అని కూడా పిలవబడే దోమలో మూడువేల ఐదు వందల [౩౫౦౦] జాతులు ఉన్నాయి. అన్ని జాతులలో కేవలం వందకి పైబడిన జాతులు మాత్రమే మనిషి శరీరం మీద వాలి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తాయి. చీకటీగ పది కోట్ల సంవత్సరాల క్రిందటే ఉనికిలో ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జికా, చికున్ గున్యా, డెంగ్యూ , మలేరియా, ఇలా ఎన్నో ప్రాణాంతక రోగాలను వ్యాప్తి చేయగల మశకము భూమికి భారమా? వాటిని సూటిగా ఘాటైన ప్రశ్నలను అడగడానికి మా సాహిత్యలోకం బృందం దగ్గర్లో ఉన్న సోఫా కిందకి దూరి ఒక చీకటీగతో ముఖాముఖి జరపగా, ఆ దోమ కొన్ని ఆలోచింపజేసే నిజాలను వెల్లడించడం జరిగింది.

[*మే = మేము, *దో = దోమ]

మే: ప్రపంచంలో అన్ని జంతువులకన్నా మీరే ఎక్కువ మంది ప్రాణాలు తీస్తున్నారు, దానికి మీరు ఏమి సమాధానం చెప్తారు?

దో: మా సృష్టికి కారణమే జీవ నియంత్రణ. ఎక్కడ జీవం అధికమై ఇంకొకరికి భారం అవుతుందో అక్కడ మా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మే: అంటే మనుషులు భూమికి భారం అంటారు?

దో: ఆ ఆలోచన మీకొచ్చిందంటే సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది కదా.

మే: పసి పిల్లలని, అమాయకులని కూడా చంపేస్తున్నారు, దానికేమంటారు?

దో: మాకు చిన్న-పెద్ద తారతమ్యాలు తెలియదు. వీలుగా ఉన్న ఏ జంతువు కనిపించినా ఆహరం కోసం వాలుతాం. మాలో ఉన్న సూక్ష్మ క్రిముల ప్రభావాన్ని బట్టి వ్యాధులు వస్తున్నాయి, అందులో మా తప్పు ఏమి లేదు కదా. పైగా మేము ఎమన్నా శాస్త్ర-విజ్ఞానాలు వాడి జీవసంబంధమైన యుద్ధం చేస్తున్నామా? మా జీవన శైలి అంతే.

మే: దోమ జాతి రక్తం పీల్చడం మాత్రం ఆపదు అంటారు?

దో: మగదోమలు రక్తం పీల్చవు, ఆడ దోమలు సంగమం ద్వారా కలిగిన గుడ్లను సక్రమంగా పెరిగేలా చేయాలి అంటే రక్తం తాగడం అవసరం.

మే: ఎన్ని చెప్పినా మీ వల్ల జీవులకి అసహనం, చిరాకు, కోపం వస్తాయి!

దో: కాదనలేను. కానీ మండు వేసవిలో సూర్యుడి ప్రతాపానికి కూడా మనిషికి అసహనం, చిరాకు, కోపం వస్తాయి.

[కాసేపు నిశ్శబ్దం, మా బృందానికి ఏమి మాట్లాడాలో తెలియలేదు]

[మైక్ పట్టుకున్న అతను, నా చెవిలో ఒక ప్రశ్న అడగమని చెప్పాడు, సంతోషంతో అతని వైపు చూసి “ఈ ప్రశ్నతో చీకటీగ ఆలోచనలను మార్చేయొచ్చు” అనుకుని ఆ మసకము వైపు తిరిగాము.]

దోమ

మే: ఇన్ని చెప్తున్నారు కదా, దోమల వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి?

దో [నవ్వుతున్నట్టు శబ్దం చేసి]:

ఫలదీకరణం, మా జాతిలో మగవారు చెట్ల మీద మొక్కల మీద వాలి ఒక పుష్పం నుండి ఇంకో పుష్పానికి పుప్పొడి చేరవేసి ప్రకృతిలో వృక్ష సంపదను పెంచుతాయి.

మేము పెట్టె గుడ్లు, వాటి నుండి వచ్చే డింభకాలు తిని అత్యధిక శాతం చిన్న చాపలు, ఇతర జీవులు బతుకుతున్నాయి. మా డింభకాలు లేకపోతే, చిన్న చాపల మనుగడ కష్టం అయిపోతుంది, దానితో ఆహార గొలుసు క్రమంలో మార్పులు వచ్చి పెను ప్రమాదం సంభవిస్తుంది. అంతే కాదు మేము ఎన్నో పక్షులకు ఆహారంగా మారుతాము, మా ప్రాణాలను అర్పించి వాటి ప్రాణాలను నిలబెడతాము.

మీ శాస్త్రజ్ఞులు, చీకటీగలను అధ్యయనం చేసి మాలో నొప్పి రాకుండా రక్తం పీల్చే గుణానికి కారణం తెలుసుకుని, ఆ పద్దతిని మనుషులకు శస్త్రచికిత్స చేసేటపుడు ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చీకటీగల వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి.

[మరింత నిశ్శబ్దం, ఊహించని ఓటమి మబ్బులా కమ్మేసినట్టి నిశ్శబ్దం]

దో: మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా! నేను ఒక్క ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి – మనుషుల వల్ల మీకు తెలిసిన కొన్ని ఉపయోగాలు చెప్పండి?

[దోమ వేసిన ప్రశ్నకి ఎంత సేపు ఆలోచించిన సమాధానం లేదు, కోపంతో]

మే: నీలాంటి రక్తం తాగే జీవులనుండి అందరిని విముక్తి చేస్తాం.

ఆ సమాధానం చెప్పి, దోమని చేత్తో నలిపేసి దాని రక్తాన్ని సోఫాకి పూసి మేము బయటకి వచ్చేసాము.

దోమతో ముఖాముఖి జరిగి మూడు రోజులు అయింది, ఇప్పటికీ మాకు అంతుచిక్కని ప్రశ్న –

మనుషుల వల్ల ఉపయోగాలు ఏమిటి?

Comments

comments