కబీరు – దిగంబర రహస్యం – కవిత

దిగంబరుడవై తిరిగినా,
జంతు చర్మము ధరించినా,
నీలోని రాముని చూడకున్న ప్రయోజనమేమి?

యోగి కోరు సంగమము
భూతలమున సంచరించుట వలన వచ్చిన,
వనాన జింక చేయు సంచరణ దానిని అమరము చేయదా?

బోడి గుండు చేసిన
ఆధ్యాత్మిక సాఫల్యమొచ్చునన్న,
స్వర్గమంత గొర్రెలతో నిండి యుండునే.

ప్రత్యుత్పత్తి చేయకుండ విత్తునాపిన,
స్వర్గమందు నీకు చోటు దొరకునైతె,
నపుంసకులే చేరెదరుగదా ప్రధమస్థానమున.

కబీరు వాక్కు ఇది లక్ష్యపెట్టు సహోదరా,
రాముని నామము లేకున్న
ఎటుల సాధ్యము ఆత్మజ్ఞానము ప్రాప్తించుట?

పదిహేనవ శతాబ్దానికి చెందిన సాధువు మరియు కవి, కబీరు దాసు. విగ్రహ పూజకు వ్యతిరేకమైన కబీరు, దేవుణ్ణి మనిషి తనలోనే వెతకాలి అనే ఆలోచనను వ్యక్తపరిచేవాడు. ఆయన నమ్మిన భక్తి సిద్ధాంతం ప్రకారం మనిషి దేవునితో ఐక్యం అవ్వాలంటే పరమాత్మ పట్ల సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. పరమాత్మకు మనిషి ఏ పేరు అయినా పెట్టుకుని ఉండొచ్చు; ఉదాహరణకు రాముడు, కృష్ణుడు, లక్ష్మి, మొదలైనవి. ఆయన ప్రభోదించే ఐక్యత తత్త్వం హైందవ విధానాలను, ఇస్లాముల విధానాలను కలబోసినట్టు ఉంటుంది.

తాత్పర్యం

కబీరు


పైనున్న కవితలో కబీరు రాముని పరమాత్మగా భావించి తన భావాలని వ్యక్తపరుస్తాడు. అంతేకాక, ఆధ్యాత్మిక బోధనల వెనుక ఉన్న అసలైన రహస్యాలను గుర్తించమని పాఠకులకు తెలిపే ప్రయత్నం చేస్తాడు.
కవిత ప్రకారం, నగ్నంగా ప్రపంచంలో తిరగడం వలనో, జంతు చర్మాలు బట్టలుగా వేసుకుని మునుల వలె వేషధారణతో ఉండడం వలనో ఏ ప్రయోజనం ఉండదు. హృదయకుహురంలో కొలువై ఉన్న పరమాత్మను గుర్తించకపోతే మనిషి చేసే అటువంటి చర్యలు వ్యర్థమని కబీరు భావన.
మోక్షప్రాప్తి కోసం యోగులు భూసంచారం చేస్తూ, అరణ్యాలలో తిరుగుతుంటారు. అయితే, కబీరు ఆలోచన ప్రకారం, అడవిలో నివసించే జింకలు యోగులకన్నా బాగా అటవీ సంచారం చేయగలవు. కాబట్టి జీవనచక్రం నుండి విముక్తి పొందే అవకాశం జింకలకే ఎక్కువ ఉంటుంది.
తల మీద జుట్టు లేకపోతే ఆధ్యాత్మిక భావనలు అధికమవుతాయని కొందరు విశ్వసిస్తారు. అయితే కాలానుగుణంగా గొర్రెలకు దేహమంతా జుట్టు తీస్తూనే ఉంటారు మనుషులు, ఆ విధంగా స్వర్గానికి ముందుగా గొర్రెలే వెళ్ళాలి కదా? అని కబీరు వాదన.
కుటుంబాన్ని వదిలేసి, సంతాన వృద్ధికి అవసరమైన రేతస్సును అదుపులో పెట్టుకోవడం ద్వారా పరమపదాన్ని పొందవచ్చు అని ఒక నమ్మకం. ప్రత్యుత్పత్తి చేయకపోవడమే పరమపదానికి సోపానం అయితే నపుంసకులు ఎటువంటి నియమాలను పాటించకుండానే అర్హులవుతారు; అంటే, వైకుంఠంలో వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానము లేకపోతే మనిషి ఎటువంటి ప్రయత్నాలు చేసినా వ్యర్ధమే. ఈ విషయమే కబీరు తన కవిత ద్వారా తెలియజేసాడు.


కబీరు – దిగంబర రహస్యం – కవితా విశ్లేషణ


ఆధ్యాత్మిక సిద్ధాంతాల వెనుక ఉన్న మర్మం – మనిషి తన కోరికలను అదుపులో పెట్టుకుని దైవత్వాన్ని తనలో నింపుకుంటాడు అని. నైతికమైన, ప్రలోభాలు లొంగని, సంతృప్తికర జీవితాన్ని గడపడమే మనిషి జన్మకు సార్ధకత. ఆ స్థాయికి మనిషి చేరుకున్నాక భగవంతుని సన్నిధి చివరి లక్ష్యంగా మారుతుంది. అప్పుడు దిగంబరంగా తిరిగినా, గుండు చేసుకున్న, అడవిలో నివసించిన, ఆ చర్యలు వ్యక్తికీ తన అంతిమ లక్ష్యాన్ని గుర్తుచేస్తూ ప్రతి చర్య ఒక సోపానంలా ఉపయోగపడుతుంది. కానీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు, ప్రాపంచిక కోరికలను తీర్చుకునేందుకు యోగులుగా మారాలి అనుకుంటే మాత్రం అది ఎన్నటికీ జరగని పనే అని కబీరు చెప్పిన సత్యం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి దొంగ-సాధువులనే ఆధ్యాత్మిక గురువులుగా ఈనాటి సమాజం భావిస్తుంది.

Comments

comments