ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ

గ్రీకు పురాణగాథలలో ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ గాథ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ కథను ఎన్నో విధాలుగా ప్రపంచమంతా ప్రచురణలో ఉండగా, ఒవిడ్ వ్రాసిన “మెటామోర్ఫోసిస్” అనే మహాకావ్యంలోని కథ అత్యంత ప్రాధాన్యత పొందినది. ఈ మెటామోర్ఫోసిస్ మహాకావ్యంలో పదవ మరియు పదకుండవ పుస్తకంలో ఓర్ఫియస్ గురించి సవివరంగా వ్రాస్తాడు ఒవిడ్.

ఓర్ఫియస్, ప్రసిద్ధ కవి మరియు సంగీతకారుడు. అతడు సంగీతంతో దేనినైనా మంత్రముగ్దుని చేయగల సామర్థ్యం గలవాడు. ఒక సారి లైర్ [వీణ వంటి తీగను ఉపయోగించు సంగీత వాయిద్యం] పట్టుకుని సంగీతం ఆరంభించాడంటే తన చుట్టూ పక్కల సజీవమైన, నిర్జీవమైనవన్నీ ఆ సంగీతం విని పరవసించవల్సిందే. ఓర్ఫియస్ కు, అతడి ప్రియురాలు అయినా యురిడిసి కు పెళ్లి జరుగుతున్న సమయాన అందరు హాజరు కాగా హైమెన్ అను వివాహానికి సంబంధించిన దేవుడు మాత్రం ఆలస్యంగా వస్తాడు. హైమెన్ హాజరు కాకపోతే ఎట్టి వివాహమైన నిస్సారంగా, అనుబంధాలు విచాకరంగా ఉంటాయి అని గ్రీకు వారి నమ్మకం. ఆ నమ్మకం నిజమన్నట్టు హైమెన్ పెళ్లి రోజు, విచారమనస్కుడై, తాను చేతపట్టు కాగడా కూడా నిస్తేజమై ఉండెను. వివాహానికి హాజరు అయినా వారు అది అపశకునం అని తలిచిరి.

అపశకునం అని కలత చెందిన వారికి ఆ అపశకునం నిజమని వెంటనే తెలుస్తుంది. ఓర్ఫియస్ మరియి యురిడిసి పెళ్లి నాడే, యురిడిసి కు ఉద్యానవనంలో పాము కాటేసి చనిపోతుంది. యురిడిసి మరణంతో, ఓర్ఫియస్ వర్ణనాతీతమైన విషాదంలో మునిగిపోతాడు. శోకం, రోదన, అసహనం అతనిలో పెరిగిపోగా, యురిడిసి లేని జీవితం వ్యర్థం అని, ఆమెను టార్టరస్ [నరక సమానమైన ప్రదేశం] లో నుండి తిరిగి తెచ్చుకుందామని బయలుదేరుతాడు.

ప్లూటో పెట్టిన షరతు

ఓర్ఫియస్ తన లైర్ తీసుకుని స్టిక్స్ నదిని దాటుకుని, టార్టరస్ పాలకుడైన ప్లూటో మరియు రాణి అయిన ప్రోసర్పిన్ ముందు నిలబడతాడు ఓర్ఫియస్. తన లైర్ ను ఉపయోగించి ప్లూటో మరియు ప్రోసర్పిన్ మధ్య ఉన్న ప్రేమ గురించి పాటలు పాడటం మొదలుపెట్టెను ఓర్ఫియస్. వారిని సంగీతంతో ఆహ్లాదపరిచాక తన భార్యను బ్రతికించమని అభ్యర్థిస్తాడు ఓర్ఫియస్. “ప్రతి జీవి ఏనాటికైనా చీకటిలో కలిసిపోతుంది, ఆ చీకటిని అనుభవించడానికి ముందు యురిడిసి ను బ్రతికించి, తన జీవితాన్ని పొడిగించండి” అని వేడుకోగా, ఓర్ఫియస్ యొక్క సంగీతానికి ముగ్దులైన వారు యురిడిసి ను బ్రతికిస్తారు.

టార్టరస్ కు, భూమికి ద్వారంగా ఉండే అవర్నస్ అనే ప్రాంతానికి ఓర్ఫియస్ మరియు యురిడిసి చేరుకోగానే, ఓర్ఫియస్ బయటకి అడుగు వేసి తొందరపాటుతో, యురిడిసి బయటకి రాక ముందే, వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తాడు. టార్టరస్ నుండి విముక్తి పొందడానికి అడుగు దూరంలో ఉన్న యురిడిసి, ఓర్ఫియస్ చూడడంతో చీకటి ఒక్కసారిగా ఆమెని లోపలకి లాగేస్తుంది. నిస్సహాయమైన ఆమె, “వీడుకోలు” అని మాత్రం చెప్పగలిగి చీకటి లోకంలో కలిసిపోతుంది.

ఓర్ఫియస్ మరియు యురిడిసి ఇక ఎప్పటికి కలిసి జీవించలేరు.

ఆ నిజాన్ని జీర్ణించుకోలేని ఓర్ఫియస్ మరల టార్టరస్ లోకి ప్రవేశింప చూస్తాడు. కానీ అతను స్టిక్స్ నదిని దాటలేకపోతాడు. ఎన్నో రోజులు అక్కడే విచారంతో కూలబడిపోయి, చివరికి ఓడిపోయినవాడై రోడోపి పర్వతాల వద్దకు చేరుకుంటాడు. బాధ తరగనిదై, శోకం ఆవరిస్తుండగా ఆ పర్వత శ్రేణుల వద్ద విషాద గీతాలు పాడుకుంటూ ఉండిపోయెను. అతని సంగీతాన్ని విని చెట్లు సైతం కదిలి అతని చెంతకు వచ్చెను.

ఓర్ఫియస్ మరియు యురిడిసి యొక్క ఎడబాటు, ఓర్ఫియస్ విషాద ఆలాపనలను ఉచ్చ స్థాయికి తీసుకువెళ్లాయి. హృదయాలను కరిగించే ఎన్నో ప్రేమ కథలను తీసుకుని వాటిని ప్రేమ గీతాలుగా ఆ పర్వత శ్రేణులలో పాడుతుంటే, అక్కడ ఉన్న ప్రతి జీవి అబ్బురపడి వినెను.

మీనాడులు

డయోనిసియస్ అనుబడే దేవునికి అనుచరులైన స్త్రీలు మీనాడులు, వీరికి సురము సేవించడం, అడవులలో సంచరించడం, నచ్చిన పని చేయడం, డయోనిసియస్ ను సంతోషపెట్టడం మాత్రమే తెలుసు. పూర్వకాలాన, మీనాడులు ఓర్ఫియస్ ని తమతో శృంగారంలో పాల్గొనమని అడుగగా, అందుకు ఓర్ఫియస్ తిరస్కరిస్తాడు. ప్రస్తుతం ఒంటరిగా బాధలో ఉన్న ఓర్ఫియస్ ను, ఆ పర్వతం లో ఉన్న ఒక మీనాడు గుర్తించి మిగతా వారికి సమాచారం ఇస్తుంది. వారందరు ఓర్ఫియస్ ను చంపగోరి, అతను ఉన్న స్థలానికి చేరుకొని, రాళ్లు చేతబట్టి అతనిని కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓర్ఫియస్ సంగీతానికి, అతని లైర్ యొక్క ప్రభావానికి ఆ రాళ్లు అతనిని తాకలేక అతని పాదాల వద్దకు చేరుతాయి.

ఓర్ఫియస్ మరణం

అతని సంగీతం యొక్క విశిష్టతను తెలుసుకున్న మీనాడులు, దాన్ని అధిగమించడానికి వారి వద్దనున్న సంగీత పరికరాలతో ధ్వని చేస్తూ, గట్టిగా పడుతూ, అతని సంగీతం వినపడకుండా చేసెను. ఆ తర్వాత అతనిని చేరుకోవడాని ఓర్ఫియస్ చుట్టూ చేరిన పక్షులను, జంతువులను చంపి, తమ వద్దనున్న తర్సుస్ [మీనాడులు వాడే చేతి కర్ర] సహాయంతో అతనిని చాలా దారుణంగా దాడి చేస్తారు. అంతటితో సరిపెట్టుకోలేక వ్యవసాయ పరికరాలను తెచ్చి వాటితో దాడి చేస్తారు.

ఓర్ఫియస్ మరియు యురిడిసి

అమరమైన గొంతు గల ఓర్ఫియస్ వారి దాడితో మూగబోతాడు, అతడి అవయవాలను మీనాడులు ఆక్రోశంతో చీల్చి ఆనందం పొందుతారు.  కిరాతకంగా రీతిలో చనిపోయిన ఓర్ఫియస్ ను చూసి ఆ అడవి, పర్వత శ్రేణి గుండె కరిగి రోదించగా, పగ చల్లారని మీనాడులు ఓర్ఫియస్ తలను, అతని లైర్ ను హీబ్రుస్ నదిలో పడేస్తారు. నీటిలో పడుతున్నప్పుడు లైర్ తీగలు దుఃఖముతో వేదనను తెలుపు శబ్దములు చేయగా, హీబ్రుస్ నది సమస్తం ఆ బాధ ప్రతిధ్వనించెను.

ఓర్ఫియస్ మరియి యురిడిసి కలయిక

హీబ్రుస్ నదిలో కొట్టుకుపోతున్న ఓర్ఫియస్ శిరస్సు, లెజ్బోస్ ద్వీప ప్రాంతమైన మితిమ్నకు చేరుతుంది. అక్కడ అపోలో అను దేవుడు, ఓర్ఫియస్ శిరస్సును కాపాడి, అతడిని చీకటి లోకానికి పంపించెను. తానూ యురిడిసి కోసం సంచరించి లోకానికి వచ్చానని గ్రహించిన ఓర్ఫియస్, క్షణం ఆలస్యం చేయకుండా తన ప్రియురాలు/భార్య కోసం వెతుకుతాడు. చివరికి తన ప్రాణమైన యురిడిసి దగ్గరకు చేరుకుంటాడు ఓర్ఫియస్. చనిపోయిన ఓర్ఫియస్ ఎంతో సంతృప్తితో ఆమె ఉనికిని ఆస్వాదిస్తూ, ఆమె చేతులు పట్టుకుని నడుస్తూ, ఆమె వంక చూస్తూ, ఆమె ఇక అదృశ్యం ఎవ్వడు అనే ధైర్యంతో చీకటి లోకమంతా ప్రేమని నింపుకుని సంచరిస్తాడు ఓర్ఫియస్ – ఓర్ఫియస్ మరియు యురిడిసి ల ప్రేమ శాశ్వతం అయ్యింది.

మీనాడులకు శిక్ష

డయోనిసియస్ తన అనుచరులు చేసిన కిరాతకాన్ని తెలుసుకుని, వారిని శిక్షంచడనికి ఉపక్రమించెను. ఓర్ఫియస్ అంటే మిక్కిలి వాత్సల్యం గలవాడైన డయోనిసియస్, మీనాడులను ఏ అడవిలో అయితే ఓర్ఫియస్ ను చంపారో అదే అడవిలో చెట్లకు నిర్బంధించి వదిలేసెను. వారు ఎంత ప్రయత్నించినా చెట్లనుండి విడిపించుకోలేక బెరడు వారి జీవాన్ని, శరీరాన్ని తీసుకువెళ్తున్న బాధను అనుభవిస్తూ వారు రూపవిక్రియ చెందుతారు. మీనాడులు రూపాంతరము చెంది సింధూర వృక్షాలుగా [ఓక్] మారిపోతారు, ఆ విధంగా డయోనిసియస్, ఓర్ఫియస్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు.

Comments

comments