రెండవ వ్యాసము – సాంకేతిక అనుసంధానమే “తెలుగు భాష” కు రక్షణ ఛత్రం
1. శాస్త్రం + సాంకేతికత <=> తెలుగు
21 వ శతాబ్దం అద్భుతాలకు నిలయం. సాంకేతికతకు ఆలవాలం. అసాధ్యమే సుసాధ్యంగా చేస్తోంది ప్రయాణం. ఈ ప్రస్థానంలో సాంకేతికత (Technology) ఉరకలేస్తుంది. ఇందులో ఏ భాషైనా కొట్టుకు పోవాల్సిందే. కొన్ని కొట్టుకు పోతున్నాయి. మరికొన్ని దానితో కలిసి పరుగులు పెడుతున్నాయి. మరి మన తెలుగు భాష? ఏం చేయాలనే ఆలోచనలో ఉంది. ఆ ఆలోచనలోంచి బయటకు రావాలి. నేటి సాంకేతిక సమాజంతో సమానంగా పరుగు పెట్టాలి. అలా పెట్టాలంటే ఏం చేయాలి? తెలుగు భాషను, సాహిత్యాన్ని సాంకేతికతకు అనుసంధానిస్తే సరి. అంతం లేని ఈ అనంత సాంకేతిక లోకంలో తెలుగు ఉనికి పదికాలాలు పదిలంగా ఉంటుంది.
శాస్త్రం అంటే ఒక ఊహా కల్పన. ఆ ఊహా కల్పనకి ప్రతిరూపమే ప్రయోగం. ఆ ప్రయోగానికి అనువర్తనమే (application) సాంకేతికత. శాస్త్రానికి మూలం భాష. ఆ భాషే సాంకేతికతను చూసి భయపడే స్థితి నేటి దుస్థితి. కానీ మన తెలుగుకి అటువంటి భయం లేదు. సాంకేతికతకు ధీటుగా తనలో ఎన్నో విషయాలను దాచుకుంది. వాటిని మనం నేడు బయటకు తీస్తే చాలు, సాంకేతికతే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇదే నేడు మనం చేయాల్సిన పని. అలా చేస్తే మన తెలుగు భాషా పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే స్థితే లేదు.
2. తెలుగు భాషలో ఉన్న శాస్త్రీయ నిజాలు – సాంకేతిక అనువర్తనాలు:-
2.1. భౌతిక శాస్త్ర వివరణలు:-
సమాజాన్ని ఒక ఒక తలం(Surface) అనుకుంటే దానిపై ప్రసరించే కిరణాలు (Incident Rays) దేశభక్తి గేయాలు. ఆ దేశ భక్తి గేయాలు లక్ష్యం, అవి చేరిన చోటు ఒకటే అయితే దానిని భౌతిక శాస్త్ర పరంగా ప్రతిబింబం (Reflection) అంటాం. అదే ఆ లక్ష్యం కాస్త మారి చేరితే దానిని వక్రీకరణం అంటాం (Refraction). ఇలా ఈ ప్రతిబింబం, వక్రీకరణాలలో నాటి సామాజిక స్థితిగతులను అన్వయిస్తే అదే నాటి కాలంలో ఉన్న సాంకేతికత. 19 వ శతాబ్దంలో గురజాడ, రాయప్రోలు రచించిన దేశభక్తి గేయాలు సమాజంలో కలిగించిన అలజడులే దీనికి తార్కాణాలు.
ప్రతిబింబం, వక్రీకరణాలలో దేశభక్తి
2.2. అనగనగా ఏడు చేపల కథ:-
చేప -> గడ్డివాము -> ఆవు -> గోపాలుడు -> అవ్వ -> చిన్న పిల్లవాడు -> చీమ -> బంగారు పుట్ట. ఇదే కథ.
కథలో వేదాంత ధోరణి:-
(క్రింద నుండి పైకి చూసినట్లయితే “ఈ సమాజంలో మనిషి చిన్నతనంలోనే చెడు స్వభాన్ని విడిచి పెడితే చీమ కుట్టక, అమ్మ అనుగ్రహిస్తుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మన కష్టాలు తీరుస్తారు. హాయిగా వృద్ధాప్యానికి చేరుకొని ప్రశాంతమైన మరణంతో మోక్షాన్ని పొందవచ్చు”)
ఈ కథని ఒకే కోణంలో చూస్తే తలపోటు. అందుకే ఈ కథని వినడానికి ఎవరూ ఇష్టపడరు. అదే మరో కోణంలో చెప్తే కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. ఇలానే మన తెలుగులో చాలా కథలున్నాయి. కావ్యాలు, గ్రంథాలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మనది. ఒక పార్శ్వంలో విని, చదివి ప్రజలు విసుగెత్తిపోయారు. వాటిని మనం మరో కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తే తెలుగు ఉనికి ఉరకలేస్తుంది.
2.3. వేమన పద్యాలు – సాధనతోనే సాధ్యాలు :-
“అనగననగ రాగ మతిశయిల్లుచునుండు / తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన / విశ్వదాభిరామ వినుర వేమ”
ఇవాన్ పావ్ లోవ్ అనే వ్యక్తి పరిశోధన ద్వారా “ కండిషనల్ థియరీ” ని ప్రతిపాదించాడు. దీనిలో భాగంగా ఒక కుక్కకు రోజూ గంట కొట్టి భోజనం పెట్టేవాడు. ఒక రోజు గంట కొట్టాడు. కానీ భోజనం పెట్టలేదు. గంట కొట్టగానే కుక్క నోట్లో లాలాజలం ఊరింది. ఈ విధంగా నిర్ధిష్టంగా, నిర్ధిష్టమైన సమయంలో చేసే పనులు జీవులకు అలవాటవుతాయి. ఇదే ఈ పద్యంలో దాగిన నగ్న సత్యం. దీన్ని వేమన ఎప్పుడో శాస్త్ర రూపంలో చెప్పేశాడు. ఇవాన్ పావ్ లోవ్ ప్రయోగం చేసి చూపించాడు. మనం దానిని అనుకరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలియాల్సింది ఏమిటి? సాంకేతిక కళ్ళు తెరవక ముందే తెలుగు పళ్ళు తోముకుంది. ఇలా ఇదొక్కట్టే కాదు. వేమన పద్యాలు మాత్రమే సాంకేతికత రూపాలు కాదు. తెలుగులో ఉన్న ప్రతి పద్యము సాంకేతికతకు నిదర్శనమే.
3.0. భాషా శాస్త్ర వేత్తలే భావి తెలుగుకు భరోసా :-
తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రతీ పద్యం, కావ్యం, కథ, కవిత అన్నీ సాంకేతికతకు మూలాలే. కానీ వాటిని వెలికి తీసే శాస్త్రవేత్తలే ఇప్పుడు కరువయ్యారు. కాబట్టి ప్రతి కవి, విద్యార్థి, తెలుగు పౌరుడు భాషా శాస్త్రవేత్తగా మారి తెలుగులో తెలియని కోణాలను ప్రపంచానికి చూపించాలి. తెలుగును సాంకేతికతో అనుసంధానించాలి. అలా చేస్తే తెలుగు భాష అంతం కోసం ఆలోచించాల్సిన పనేలేదు. సూర్య, చంద్రులున్నంత కాలం తెలుగు భాషకు తిరుగేలేదు.
వ్యాసం రచించిన వారు:
గొల్లంగి చిన్నబాబు
నూజివీడు
కృష్ణా జిల్లా
Twitter – @chinna10250729