మొదటి వ్యాసం – తెలుగు భాష ఉనికిని కాపాడేందుకు ఏం చేయాలి?

భాష అన్నది కేవలం పదాలు, మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, భాషలో ఒక సంస్కృతి నిక్షిప్తమై ఉంటుంది. ఆ సంస్కృతిని పెంపొందించటానికి తరతరాలుగా ఏంతోమంది కృషి చేసి, ఆయా దేశ కాల మాన పరిస్థితులకి అణుగుణంగా జీవన విధానాన్ని, అలవాట్లను, ఆచారాలను మనకి అందించారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, రోజూ జరిగే సన్నివేశాలను నాటకీయంగా వర్ణించడానికి తెలుగులొ బొలెడన్ని జాతీయాలు సామెతలూ ఉన్నాయి. అది మాత్రమే కాదు, మన పూర్వ తరాలు యెలాంటి జీవితాన్ని గడిపేవాళ్ళో, వాళ్ళు చూసిన కష్టాలు, వాటిని అధికమించటానికి తీసుకున్న మార్గాలు, వాళ్ళు నేర్చుకున్న పాఠాలు, మనకి సాహిత్య రూపంలో అందించారు. ఒక భాషను కోల్పోవటం, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని వృధా చేయటమే కాక భావి తరాలకు దూరం చేసిన వాళ్ళమవుతాము. అందుకే, కేవలం తెలుగు భాష మాత్రమే కాదు, ప్రపంచంలొ ఉన్న అన్ని భాషలనీ మనం రక్షించుకోవాలి. 

తెలుగు భాష, ఇంచుమించు 7-7.5 కోట్ల ప్రజలు మాట్లాడతారు. తెలుగు దిన పత్రికలకు  గిరాకీ బాగానే ఉంది (ఈనాడు: ఇంచుమించు 20 లక్షలు, సాక్షి: 10 లక్షలు). వార-సినీ పత్రికల వెబ్-పేజీని అంతర్జాలంలో కొన్ని లక్షలమంది రోజూ చూస్తారు. యూ-ట్యూబ్ లొ బోలెడు తెలుగు లఘు చిత్రాలు, నాటకాలు ఉన్నాయి, పైగా ప్రతీ రోజు మరిన్ని లఘు చిత్రాలు నిర్మించబడుతున్నాయి. సంవత్సరానికి దగ్గరగా 150-200 తెలుగు చలనచిత్రాలు విడుదల అవుతాయి.

ఈ మెరమెచ్చులు చూసి తెలుగు భాష ఉనికికి అస్సలు ముప్పు ఏమి లేదు అని అనుకోవడం పొరపాటే అవుతుంది. తెలుగు భాష ఉనికికి నా అభిప్రాయంలొ మూడు ముప్పులు ఉన్నాయి. ఒకటి, యువతరానికి తెలుగు నెర్చుకోవాలి, తెలుగులొ మాట్లాడాలి, అన్న ఆశక్తి లేకపోవడం. రెండు, తెలుగు భాష బదులు ఆంగ్ల భాషలొ మాట్లాడటం. మూడు, అతి కీలకమైనది, ఇప్పుడిప్పుడే తల్లి-తండ్రులైన పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పీంచటం మీద ఆశక్తి చూపించకపోవడం. ఒక మామూలు తెలుగు ఇంట్లొ సంభాషణలు వింటే, వాటిలో సగం ఆంగ్ల పదాలే ఉంటాయి. అన్నంని రైస్ అని, మంచినీళ్ళని వాటర్ అని, చివరికి ఇంటిని హౌస్ అని అంటున్నారు. అఆలతో మొదలుపెట్టలసిన చదువుని, యేబిసీలతో మొదలుపెడుతున్నారు. తెలుగు దిన పత్రికలను చాలామటుకు 40-50 వయస్సు పైబడిన వాళ్ళే చదువుతున్నారు తప్ప, యువతరం ఆంగ్లపత్రికలు చదవడానికే మొగ్గుచూపుతున్నారు. అంతర్జాలంలో తెలుగు-ఆంగ్లం కలిపి, ఒక వింత భాషలో మాట్లాడుతున్నారు. అందుకే వాటిల్లో తెలుగు లిపి కంటే రోమన్ లిపి వాడతారు. ఇక చలనచిత్రాల గురించి చెప్పాలంటే, మాటల్లో అచ్చ తెలుగు అసలు ఉండనే ఉండదు! సినీ పరిశ్రమలో పని చేసే వారితో సంభాషణలు చూస్తే, వాళ్ళు తెలుగు కంటే ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అనుకుంటారు (దీనికి గేయ రచయితలు మాత్రం ఒక మినహాయింపు. వాళ్ళు మాత్రం చాలావరకూ అచ్చ తెలుగులొనే మాట్లాడతారు). ఇటువంటి పరిస్థితిలో తెలుగు భాష ఇంకో 100 సంవత్సరాలు బ్రతికి ఉంటుందా అని అనుమానం వస్తుంది. 

తెలుగు భాషను రక్షించుకోవాలి అంటే పిల్లలకు తెలుగు సాహిత్యం పరిచయం చెయ్యటం, కధలు వినిపించటం, శతకాలు నేర్పించటం, వంటి సూచనలు చాలా మంది ఇస్తారు. నేను, వీటికి భిన్నంగా, భవిష్యత్తులో మన జీవితాన్ని ప్రభావితం చేసే విషయాలకు సంబంధించిన నలహాలను ప్రస్తావిస్తాను. నా ఉద్దేశం పైన ఇచ్చిన సూచనలు పాటించకూడదు అని కాదు. నా అభిప్రాయంలో, ఏంత యెక్కువమంది తెలుగు భాష వాడితే, భాషలో ఉన్న సాహిత్యానికి అంత ఆదరణ పెరుగుతుంది.  అందుకే తెలుగు భాష వినియొగం వృత్తి, వ్యవహార, సామాజిక విషయాలలో పెరగాలి. నా సూచనలన్నీ ముఖ్యంగా సమాచార-యుగం వల్ల వచ్చిన మార్పులను తెలుగు వినియోగానికి అనుగుణంగా మార్చుకోవటమే.  ఇవి సాంకేతిక, వ్యావహారిక, మరియు సామాజిక మార్గాలకు సంబంధించినవి అయ్యి ఉంటాయి. సాంకేతిక మార్గము వలన, తెలుగు వల్ల వృత్తిపరమైన ప్రయోజనాలు కలిగే మార్గాలు, వ్యావహారిక మార్గాల వలన దైనందిక జీవితంలో తెలుగు వాడుక పెరిగే మార్గాలు, సామాజిక మార్గాల వలన బయట ప్రపంచానికి తెలుగు గొప్పదనం తెలిసి, తెలుగు మీద ఆసక్తి కలిగే మార్గాలు సూచిస్తాను.

సాంకేతిక

తెలుగు భాష వాడుక పెరగాలి అంటే కేవలం భాషమీద మమకారంతో ఉన్న వాళ్ళు మాత్రమే పూనుకుంటే సరిపోదు. తెలుగు భాష నేర్చుకోవటం వల్ల ఆర్ధికంగా లాభం, నేర్చుకోవకపోతే నష్టం వస్తుంది అంటేనే, సామాన్య జనులు తెలుగుని నేర్చుకోవటానికి నడుము బిగిస్తారు. ఆర్ధిక ప్రయోజనం కోసమే కదా చాలా మంది భారతీయులు ఆంగ్లము, ఫ్రెంచి, జర్మన్, సరికొత్తగా చైనీస్ నేర్చుకునేది. ప్రస్తుతానికి మనం సమాచార-యగంలో ఉన్నాము. ఈ యుగంలో కొత్తగా తయారయ్యే పరికరాలు ఏక్కువగా కంప్యూటర్ లేక సమాచార విజ్ఞానానికి సంబంధించినవి ఉంటాయి. అటువంటి పరికరాల పేర్లు, వాటికి సంబంధించి నాణ్యతతో కూడిన విజ్ఞానం ముందుగా తెలుగులో అందజేస్తే ఆశక్తితో యువతరం తెలుగు వింటారు, నేర్చుకుంటారు. ప్రస్తుతం కంప్యుటర్ ప్రోగ్రామింగ్ కి వాడే భాషలు అన్నీ ఆంగ్లము నించే ప్రేరేపితం అయ్యాయి, పైగా రోమన్ లిపిలోనే వ్రాయబడతాయి. దీనికి భిన్నంగా తెలుగులిపిలొ, తెలుగు భాషతో ప్రేరేపితమైన ఒక కంప్యూటర్ భాషను తయారు చేసే అవసరము ఉన్నది. అటువంటి కంప్యూటర్ భాషను తెలుగు వచ్చిన పిల్లలు సులువుగా అర్ధం చేసుకోగలరు.

అటువంటి కంప్యూటర్ భాషను తెలుగులో తయారు చెయ్యటం వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, సమాచార-యుగంలో వాడే వస్తువులన్నిటికీ తెలుగు పేర్లు పెట్టటం వలన మన భాషలో ఆంగ్ల పదాల వాడుక తగ్గుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా యంత్ర-యుగంలో కనిపెట్టిన పరికరాలకి దురద్రుష్ట వశాత్తు తెలుగులో సులువైన పదాలు సృష్టించలేదు, సృష్టించినా వాటి వాడుక తెలుగులో ఏక్కువగా లేదు. ఇంజన్, మోటర్, ఫ్లయిట్, వంటివి కొన్ని దశాబ్దాలుగా మనము వాడుతున్నా, ఇంకా మనము వాటికి సులువుగా పిలుచుకునే తెలుగు పేర్లు పెట్టలేదు. రైలుకు ధూమశకటము అన్న కష్టమైన పేరు పెట్టటం వలన ఏవ్వరూ వాడకుండా పోయింది. ఐరోపా కూటమి, చైనా, జపాన్ దేశాలు ఇటువంటి తప్పు చెయ్యలేదు. యంత్ర-యుగంలో పరికరాలకు వెంటనే వాళ్ళ-వాళ్ళ భాషలలో పేర్లు పెట్టేసి, ఆ శాస్త్రాలని సొంత భాషలో బోధించటం మొదలుపెట్టారు. ఇటువంటి పొరపాటుని మనము సమాచార-యుగంలో మళ్ళీ చెయ్యాకూడదు. రెండు, యునెస్కో పరిశోధనలో తేలినది ఏమిటంటే, ఏ విషయమయినా పిల్లలకు వాళ్ళ మాతృ భాషలో బొధిస్తే చాలా తొందరగా, మరియు బాగా అర్ధం అవుతుంది అని. సమాచార-యుగంలో ఉండే సాంకేతిక విషయాలను తెలుగులో బొధించటం వలన తెలుగు మాతృభాష  అయిన పిల్లలు ఆ రంగంలో విజయం సాధించటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న సాఫ్ట్-వేర్ పరిశ్రమకి ఇది మరింత దోహద పడుతుంది. ఈ మార్పులు మనము చెయ్యకపోతే, ఎన్ని రోజులు ఐనా మనము ఇటువంటి సాంకేతిక పదాలను ఆంగ్లంలోనే మాట్లాడతాము, తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తాం. బహుశ ఐరోపా దేశాలు, చైనా, జపాన్ వారి మాతృభాషలో సాంకేతిక విద్యని అందించటం వల్లనే ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి.

చాలా మంది నిపుణులు 1-5 (లేదా 1-10) తరగతులవరకు కేవలం తెలుగు మాధ్యమంలోనే బొధించాలని సూచించారు. ఈ సూచనతో నేను ఏకీభవిస్తాను. దీనికి వ్యతిరేకంగా వాదించే వాళ్ళు రెండు వివాదాంశాలు లేవనెత్తుతారు. మొదటిది, భారత దేశంలో అఖిలభారత సంస్థలలో కేవలం ఆంగ్లమే వాడతారు. తెలుగు మాధ్యమంలో నేర్చుకున్న వాళ్ళకి ఇటువంటి మార్పు కష్టతరం. రెండు, యాజమాన్యానికి సంబంధించిన వ్రువృత్తులలో ఆంగ్లంలో తరచూ సంభాషించవలసివస్తుంది. తెలుగు మాధ్యమంలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళని అమాంతం ఆంగ్లంలో మాట్లాడమనటం వాళ్ళకి కష్టతరం అవుతుంది. ఈ రెండు అంశాలు చర్చించదగ్గవే. వీటిని అధికమించటానికి నేను రెండు మార్పులు సూచిస్తాను. తెలుగు మాధ్యమంలో పాఠాలు నేర్పటంలో పాటు, 1-5 తరగతి విద్యార్ధులకి ఆంగ్లంలో కేవలం వ్రాయటం మాత్రమే కాదు, ఆంగ్లంలో మాట్లాడటం కూడా నేర్పించాలి. నిజానికి ఈ సమాచార-యుగంలో ఇది చాలా సులువుగా సాధించచ్చు. గత 10 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్-ఇంటలిజెన్స్ లో వచ్చిన విప్లవం దీనిని చాలా సులభతరం చేసింది. ప్రస్తుతం డీప్-లర్ణింగ్ ని వాడి తయారుచేసిన సాఫ్ట్-వేర్ తో ఆంగ్లంలో వ్రాసిన ఒక వ్యాసం అర్ధం ఏమిటో, వాటిలో భాషాదోషాలు ఏం ఉన్నాయో, ఆ వ్యాసంలో ఏం మార్పులు చెయ్యాలో, అన్నీ చెప్పచ్చు. అది మాత్రమే కాదు, డీప్-లర్ణింగ్ వాడి, ఒక వ్యాసాన్ని ఒక భాషనుంచి ఇంకో భాషకి అనువదించచ్చు కూడా. ప్రస్తుతం ఈ అనువాదం ఒక మనిషి చేసే అనువాదం కంటే కొంత తక్కువే ఐనా, భవిష్యత్తులో ఇది మనిషి చేసే అనువాదానికి ఇంచుమించు సరి సమానమైపొతుంది. మీకు నమ్మ సక్యం కాకపొతే, ఈ వ్యాసాన్ని మీరే గూగుల్-ట్రాంస్లేట్ లో అనువదించి చూసుకోండి (నేను వ్యాసాన్ని పంపిచ్చే ముందే గూగుల్-అనువాదం చేసి, చూసి, చెప్తున్నా). అదనంగా ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్-ఫోన్, అంతర్జాలం ఉంది కనుక, ఇటువంటి వాటిని అమలుచెయ్యటం కష్టం కాదు. పూర్వం ఇటువంటి పరికరాలు లేనందువలన ఆంగ్లం నేర్చుకోవడం, మాట్లాడటం, వ్రాయటం కష్టం అనిపించేది. మన ఆంగ్లంలో దోషాలను సరిదిద్దుకోవడం అంత సులువు కాదు. కాని ప్రస్తుత డీప్-లర్ణింగ్, మొబైల్ పనిముట్ల వల్ల ఇది సుసాధ్యం అవుతుంది. వీటన్నిటినీ ఉపయోగించుకుని పిల్లలకు ఆంగ్లం నేర్పే ఒక కొత్త ప్రణాళికని మనం తయారుచేసుకుంటే తెలుగు మాధ్యమంలో చదువుకున్న పిల్లలకు అంగ్లముతో కష్టాలు తప్పుతాయి.

వ్యవహారికంలో తెలుగు భాష

తెలిసో తెలియకో మన దైనందినపు జీవితంలో మనము చాలా ఆంగ్ల పదాలు వాడుతూ ఉంటాం. పర భాష నుంచి మన భాషకు వచ్చిన పదాలకి ప్రత్యామ్నాయ పదాలు పెద్దగా వాడుకలో ఉండవు (ఇందాక ఉదాహరించినట్టు, రైలు, బస్సు, ఫోను వంటి పదాలు). ఆటువంటి పదాలకు పర భాష పదాలు వాడటం తప్ప వేరే మార్గం లేదు. కాని, ప్రస్తుత యువతరం తెలుగులో కొన్ని వందల సంవత్సరాలుగా వాడుతున్న పదాలకి కూడా ఆంగ్లపదాలే వాడటం మనం గమనించవచ్చు. ఇది భాషకు అన్యాయం చెయ్యటమే అవుతుంది. అమ్మని మమ్మీ, నాన్నను డాడీ, తిండిని ఫుడ్, నీళ్ళని వాటర్, పొద్దున్నని మార్ణింగ్, రాత్రిని నైట్, వారాలని వీక్స్, ఏళ్ళని ఇయర్స్, చొక్కాని షర్ట్, జోళ్ళని షూస్, రుచిని టేస్ట్, చివరికి ప్రేమని లవ్, అసహ్యాన్ని హేట్, ఇలాగ చెప్పుకుంటూ పోతే తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇళ్ళు, కలిసే మనుషులు మాత్రమే కాక చివరికి మనము అనుభవించే భావాన్ని, జీవన రసాన్ని వర్ణించడానికి కూడా ఆంగ్లమే వాడుతున్నారు. ఇదంతా ఒకెత్తు, మనస్పూర్తిగా తిట్టుకోవటానికి కూడా ఆంగ్లం వాడుతున్నారే, ఇదేం ఖర్మ? మన సమాజం ఇలాగే కొనసాగితే వందేళ్ళు కాదు కదా ముప్పై యేళ్ళలో (ఒక్క తరంలొ) తెలుగు అంతరించిపోతుంది.

తెలుగు భాష

తెలుగు వాడుకలోకి పూర్తిగా రావాలి అంటే, మన రోజూ వ్యవహారాలలో కొన్ని మార్పులు చెయ్యకతప్పదు. ఇవి వినటానికి, ఆచరించటానికి చిన్నవిగా ఉన్నా, వీటి వల్ల వచ్చే మార్పు మాత్రం గణనీయం.

మొట్టమొదట, అందరమూ కుదిరినంత వరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించాలి.

రెండు, పొరపాటున ఎదన్నా ఆంగ్ల పదం వచ్చినా, దానికి ప్రత్యమ్నాయ తెలుగు పదం ఆలోచించి, ఇక ముందు ఆ తెలుగు పదాన్ని వాడాలి.

మూడు, ప్రకటనలు, దుకాణాల పేర్లు, చిరునామాలు, ప్రభుత్వ కార్యాలయాల్లొ, తెలుగుకు పెద్దపీట వేసి, ఆంగ్లము వాడుకను సాధ్యమైనంత వరకూ తగ్గించేయాలి.

నాలుగు, మనము వాడే కంప్యూటర్ మరియు మొబైల్-ఫోన్ ని ఆంగ్లములో కాకుండా తెలుగు భాషలో వాడాలి.

ఐదు, సాంఘిక ప్రసార మాధ్యమాలలో తెలుగు వాడాలి, తెలుగు వాడే వాళ్ళని ప్రోత్సహించాలి.

ఆరు, మన బంధుమిత్రులకు పంపే సందేశాలను, పూర్తిగా తెలుగులో పంపాలి.

ఏడు, మనకు దగ్గర బంధువులు తరచూ అనవసరమైన ఆంగ్ల పదాలు వాడుతుంటే, వాళ్ళకి సున్నితంగా తెలుగులో మాట్లాడమని వివరించాలి. 

పైన చెప్పిన పనులు అందరూ అన్నీ చెయ్యాలి అని లేదు. కనీసం తెలుగులో మాట్లాడటం, కంప్యూటర్-సెల్ లో తెలుగు వాడటం మొదలుపెడితే మంచిది. ప్రస్తుతం అన్నీ సాఫ్ట్-వేర్లు తెలుగులో ఉండకపోయినా, కనీసం ప్రముఖ సాఫ్ట్-వేర్లు తెలుగులో చెయ్యమని, ఆయా సంస్థలమీద ఒత్తిడి తీసుకురావాలి. సాంఘిక మాధ్యమాల పుణ్యమా అని ఏలాగో యువతరం ఒకళ్ళకొకళ్ళు బోలెడు సందేశాలు, దృశ్యాలు, ఛమక్కులూ పంపించుకుంటారు. 7 కోట్ల తెలుగు జనాభాలో కొంతమంది ఈ పనులు చేసినా, చాలా మందికి స్ఫూర్తిదాయకం అవుతారు, తెలుగు భాష వాడుక పెరుగుతుంది.  

సామాజిక

అప్పుడప్పుడు కొందరు మహానుభావుల వల్ల కేవలం ఆ కుటుంబానికే కాదు, ఆ భాష, మరియు, ఆ జాతికే కీర్తి వస్తుంది. ఉదాహరణకి, ప్రస్తుత ఆంగ్ల భాష కేవలం 1500 A.D. నుంచే మొదలయ్యింది. ఐనప్పటికీ, షేక్స్పియర్ వల్ల ఆ భాష స్థాయే మారిపోయింది. టోల్స్టాయి వల్ల, రష్యన్ భాషకి వచ్చిన గుర్తింపు చెప్పలేనిది. కెంజాబురొ ఓఏ, యూకియొ మిషీమా వల్ల జాపనీస్ భాషకు వచ్చిన గౌరవం లెక్కకట్టలేనిది.  మన తెలుగులో చూసుకుంటే, సంగీతకారులైన అన్నమయ, త్యాగరాజుల కృషి వలన, శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ప్రతీ ఒక్కరు తెలుగులో పాటలు పాడతారు.  ఈ తరంలో మన భాష అంతర్జాతీయంగా గుర్తింపుపొందాలంటే ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉద్భవించాలి. అటువంటివారిని తయారు చెయ్యలేము.

ఇటువంటి వారిని తయారు చెయ్యలేము కాని, ఆ దిశలో ఎదుగుతున్నవారిని నాశనం మాత్రం చాలా సులువుగా చెయ్యచ్చు. ప్రోత్సాహం, ఆదరణ లేని సమాజంలో ఇటువంటి వారు ఎదగనే ఎదగరు. అష్ట దిగ్గజాలు లాంటి కవులు మళ్ళీ పుట్టాలంటే, శ్రీ కృష్ణదేవ రాయ వంటి ఆదరించే రాజు ఉండవలసిందే. దీనికోసం మనము ఉడతా భక్తి సహాయం చెయ్యాలి. ఒక గొప్ప కళాకారుడిని కలిసినప్పుడైనా, లేక, వాళ్ళ కళ-కూర్పు మనల్ని రంజింపచేసినా, ఆ కళాకారుడిని ఆదరించాలి. ఉదాహరణకి, మీరు అద్భుతంగా చెప్పులు కుట్టే ఒక వ్యక్తిని కలిస్తే, మెచ్చి, వారికి తగినంత డబ్బులు ఇవ్వండి. మీ మనసుకి బాగా నచ్చిన చిత్రపటం కనిపిస్తే, ఆ చిత్రకారుడుని అభినందించి, దానికి న్యాయమైన మూల్యం ఇవ్వండి. మీ పరిసరాలలో జరిగే సాహిత్య, కళా, సామాజిక కార్యక్రమాలకు వెళ్ళి, అందులో బాగా పాల్గొన్న వారిని ప్రోత్సహించండి. కుల మత జాతి భేదం లేకుండా ఎవ్వరన్నా గొప్ప భాషా సేవ చేస్తుంటే లేదా వారి వారి వృత్తిలో బాగా రాణిస్తుంటే, వారి వెన్ను తట్టి ప్రేరేపించండి.  ఇది చదివే ప్రతీ ఒక్కరికీ నా నివేదన ఏంటంటే, ఏ రంగంలో ఐనా కష్టపడి పైకి వస్తున్న వారిని ప్రొత్సహించకపొతే, కనీసం నాశనం చెయ్యటానికి ప్రయత్నించద్దు. 18వ శతాబ్దంలో ఇలా పక్క రాజును నాశనము చెయ్యబొయే ఆంగ్ల పరిపాలనకు తివాసీ పరిచాము. ఎవరిలో ఏ రబింద్రనాథ్ దాగున్నాడో, ఏ అబ్దుల్ కలాం దాగున్నాడో, ఎవరికి తెలుసు?

సమాచార-యుగంలో ప్రపంచం నిజంగానే ఒక కుగ్రామం ఐపోయింది. ప్రపంచములో ఏ మూలన జరిగిన విషయమైనా నలుమూలలా పాకుతుంది. మనము కళాకారులకి, కర్షకులకి ఇచ్చే ప్రోత్సాహం అంతర్జాలంలో దశదిశలా పాకి ఎవరిని ప్రేరేపిస్తుందో చెప్పలేము. అందుకే, ప్రోత్సహించండి, ఆదరించండి, పది మందికి చెప్పండి.

వ్యాసం రచించిన వారు:
Parasara Sridhar Duggirala
వసంతపురి కాలని, మల్కాజ్గిరి, హైదరాబాద్.
Twitter – @psduggirala

Comments

comments