భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ

గ్రహబలం, గుండెబలం ప్రతికూలంగా వ్యవహరిస్తున్నాయా? పీడకలలు ఎక్కువగా వస్తున్నాయా? మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ దుష్టశక్తులు ప్రవేశించి ఉండొచ్చు… సత్వర ఉపశమనం కోసం సంప్రదించండి పూజ్య గురువులు, ప్రముఖ భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ గారిని…

మీ ఒంట్లో శక్తి నశిస్తుందా? అనారోగ్యం మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం ఉండట్లేదా? మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం వెంటనే కలవండి మూలికా వైద్య శిఖామణి శ్రీ కరివేపాకుల కృష్ణ
గారిని…

పాత కాలం Tempo Matadorని మార్పులు చేసి, ఒక్కొక్క ఊరిలో ఆ ఊరి పరిస్థితులకు అనుగుణంగా బోర్డు [పైన చెప్పినవి] పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు కృష్ణ.  వ్యాపారం అంటే లాభ-నష్ఠాలు సహజమే కదా, కృష్ణ పరిస్థితి కూడా అంతే. ఒక ఊరిలో వింతే, ఇంకో ఊరిలో తంతే అనే రీతిలో జరుగుతుంది.

కృష్ణ చాలా వ్యాపారాలే చేసి, చివరికి ఈ రెండిట్లో స్థిరపడ్డాడు. తను చివరిగా చేసిన వ్యాపారం “డైమండ్ డబ్బా” [ఒక ఇనుము డబ్బాలో చదరపు పాచికలు వేసి ఎదుటి వారు సరైన సంఖ్య చెప్తే వాళ్లకి పదింతలు డబ్బులు, లేదంటే కృష్ణకి పందెం డబ్బులు]. ఇది వ్యాపారమా అని అనొచ్చు? పెట్టుబడి పెట్టాల్సిన ఏ విషయమైనా వ్యాపారమే అవుతుంది? జూదం కూడా వ్యాపారమే, అందులో నష్టపోతే అడవులకి వెళ్లాల్సివుంటుంది, గెలిస్తే రాజ్యాలు ఏలే అవకాశం వస్తుంది. 

ఒక రోజు బాగా తాగేసి ఉన్న ఒక ధనికుడు, తిరునాళ్ళకు వచ్చి ప్రగల్బాలు పలుకుతూ కృష్ణతో పందెం వేస్తాడు. తానూ ఓడిపోతే, తన దగ్గర ఉన్న బంగారం, డబ్బు ఇచ్చేస్తానని గొప్పలు పోయి, కృష్ణ చేతిలో ఓడిపోతాడు. దగ్గర్లో ఇది గమనించిన వ్యక్తి, కృష్ణను అవన్నీ తిరిగి ఇచ్చేయమని వారించగా, కృష్ణ డైమండ్ డబ్బాని – తిరునాళ్లను వదిలేసి పారిపోతాడు.

బంగారం అమ్మేసి Tata Matador కొంటాడు, డబ్బుతో మూలికలు, భూత వైద్య పరికరాలు [పుర్రె, ఎముకలు, వగైరా] కొంటాడు. డబ్బు బాగానే వస్తుంది అనే సమయంలో, కృష్ణకు ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మూలికలు వికటించడంతో సంసారం చేయాలి అనుకునే ఒక పండు ముసలి వాడు కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలిసి మూలికా వైద్య శిఖామణి శ్రీ కరివేపాకుల కృష్ణ దగ్గరకి ఎవరూ రారు. మూడు వారాలు వ్యాపారం లేక దాచుకున్న డబ్బులు అన్ని ఖర్చు చేసి చివరికి రెండు వేలు మిగుల్చుకుంటాడు కృష్ణ. చేసేదేమి లేక, వెయ్యి రూపాయలతో డీజిల్ కొట్టించి పక్క జిల్లాకి బయలుదేరుతాడు.

దారిద్య్రానికి ఊరు-పేరు అవసరం లేదు అన్నట్టు; కృష్ణ ఒంగోలు వచ్చినా దశ మారలేదు. విసుగొచ్చి శిఖామణిని శిఖరం మీద నుంచి తోసేసి, భూత వైద్యుడు బోర్డు పెట్టేసాడు. క్రమేపి, జనాదరణ పెరగడం; కృష్ణ తెలివిగా తనకున్న మూలికా పరిజ్ఞానంతో జనాల మానసిక రుగ్మతలను నయం చేయడంతో అతడికి మంచి పేరు వచ్చింది.

పేరుతో పాటే పోరు కూడా వస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కృష్ణ వ్యాపారానికి ఒక స్థలం అంటూ ఉండకపోవడంతో, కాలీ ప్రదేశాలలో, దారి పక్కన, జనసంచారం ఉండే దగ్గర తన వాహనాన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి. దాంతో పోలీసుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు కృష్ణ. ఒక్కోరోజు పెట్టుబడి పెట్టినంత కూడా మిగిలేది కాదు మామూళ్లు పంచాక. ఒక రోజు ఒత్తిడి తట్టుకోలేక కాఫీ తాగుదాం అని హొటల్ కి వెళ్తాడు కృష్ణ. అదృష్టం చిటికెనవేలు గోతిలో ఉంటే, దరిద్రం గోవర్ధన పర్వతం అంత ఉన్నట్టు కృష్ణకు ఆ హొటలు  లో అనుకోని సంఘటన జరుగుతుంది. డైమండ్ డబ్బా విషయంలో తనని వారించిన వ్యక్తి, పోలీసు దుస్తులతో అదే హొటలు లో కనిపిస్తాడు.

కృష్ణ కూర్చున్న చోటునుండి లేవకుండా, దొరికితే అండమానే అనుకుంటూ మొహం దాచుకుని ఉండిపోతాడు.

“నా పేరు అశోక్” అని పలికిస్తూ కృష్ణ ముందు కూర్చుంటాడు పోలీసు. కృష్ణ సగం నవ్వుతో, సగం ఒణుకుతో “కృష్ణ” అని తన పేరు చెప్తాడు.

“తెలుసులే, ఈ ఊరంతా నీ పేరు మారుమోగిపోతుల్లా! యాడ డైమండ్ డబ్బా, యాడ భూత వైద్యం. తెలివైనోడివిలే, అందుకే పేరు సంపాదించుకున్నావు.”

“పేరు మాత్రమే సంపాదించుకున్నాను సారూ, సంపాదన అంతా పోలీసులకే ఇస్తున్నాను.”

అశోక్ కాసేపు అలోచించి, “నేనొక ఉపాయం చెప్పేదా! దాంతో మనిద్దరం డబ్బుతో స్నానం చేయొచ్చు.”

కృష్ణ, అశోక్ చెప్పిన ఉపాయం [పన్నాగం అనొచ్చు] శ్రద్ధగా విని, అందులో ఆదాయంతో పాటు అపాయం కూడా ఎక్కువే అని తలిచి “నా వల్ల కాదు” అని చెప్పేస్తాడు. అశోక్ “ఆలోచించుకో, మంచి అవకాశం, ఈడ మటుకే నేను ఇట్టా చేయగలను, నీ సహాయంతోనే ఇట్టా జరగగలదు.” కృష్ణ, డబ్బులు కట్టేసి బయటకి వచ్చేసి తన Tata Matadorలో పడుకుని నిద్రపోతాడు.

తెల్లవారుజామున ఎవరో వచ్చి దబ-దబ ని కొడుతున్నారు, “కృష్ణ గారు, కృష్ణ గారు” అని అరుస్తున్నారు. కృష్ణ హడావుడిగా తలుపు తీయగా, ఎవరో పాలేరులా అనిపించాడు.

“అయ్యా, మా అయ్య గారికి ఎదో అయినది. దెయ్యం పట్టినోరిలా మాట్లాడుతున్నారు. అమ్మగారు మిమ్మల్ని తోడుపెట్టుకురమ్మన్నారు అయ్యా.”

మనిషి ఆపదలో ఉన్నాడు అని తెలియగానే కృష్ణ, తాను భూత వైద్యుడ్ని లేక మూలికా వైద్యుడ్ని అని కాకుండా సాటి మనిషిలా అలోచించి వెంటనే పాలేరుతో బయలుదేరుతాడు. వెళ్లే ముందు, ఒక సంచిలో ఈ పరికరాలు, ఇంకో సంచిలో ఆ పరికరాలు పట్టుకుంటాడు. పాలేరుతో యజమాని ఇళ్లు చేరుకుంటాడు. అదొక పెద్ద భవంతి, నిజంగా దెయ్యాలు ఉంటాయేమో అనేలా ఉంది. లోపల మాత్రం ఇంద్రభవనమే, “బాగా డబ్బున్న వారనుకుంటా మీ యజమాని?”, పాలేరుని అడుగుతాడు కృష్ణ.

“అవునయ్యా, ఈ ఊరి జమీందారు, అంతేకాదు, ఈ ప్రాంతానికి MLA కూడానయ్యా…”

పెద్దవాళ్ళతో వ్యవహారం, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ మెట్లు ఎక్కుతాడు కృష్ణ. పాలేరు చూపిన గదిలోకి వెళ్ళగానే, మొత్తం చీకటి, ఒక మూల నుంచి అరుపులు, ఇంకెవరో ఆ అరుపులకి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. పాలేరుని లైట్ వేయమంటాడు కృష్ణ. కొంచెం సందేహిస్తూనే లైట్ వేస్తాడు, ఆ వెలుగులో బెల్లం శ్రీనివాస్ నాయుడు దేహం మీద ఆధీనం లేకుండా ఊగిపోతూ కనిపించాడు కృష్ణకి, అతని పక్కనే భార్య ఏడుస్తూ, ఓదారుస్తూ ఆయన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కృష్ణ వెంటనే సంచిలో నుండి మత్తు కలిగించే మూలిక తీసి శ్రీనివాస్ నాయుడు ముక్కు దగ్గర పెడతాడు. నెమ్మదిగా అతను నిద్రలోకి జారుకుంటారు. 

నిశితంగా పరీక్ష చేసి, “ఈయన పరిస్థితి విషమంగా ఉంది, నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఒక వైద్యుడు కూడా ఉంటే బాగుంటుంది” అని నాయుడు భార్యకి చెప్తాడు. అందుకు ఆమె, “డాక్టర్ చేయగలిగితే ఏనాడో ఈయనకి నయం చేసేవాళ్ళం, మీరే ఏదోకటి చేయండి. ఈయనకి నయం అయితే మీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను.” ఏడుస్తూ చెప్పింది ఆమె.

డబ్బు మాట వినగానే ఆశ పుడుతుంది కృష్ణకు, కానీ శ్రీనివాస్ నాయుడుకి దెయ్యం పట్టలేదు మానసిక ఒత్తిడి వల్ల ఆలా అయ్యాడు అని అతనికి తెలుసు. మనో వేదనకన్నా భయంకరమైన దెయ్యం ఏముంటుంది? ఇతనికి భూత వైద్యుడికన్నా, మూలికా వైద్యమే మంచి చేస్తుంది అని భావిస్తాడు. కానీ పాలేరు, భార్య నమ్మాలంటే భూత వైద్యుడు వేషంలో మూలికలు ఉపయోగించడమే మంచిదని తలిచి శ్రీనివాస్ నాయుడుకి నయం చేయడానికి అంగీకరిస్తాడు.

ఆమెను బయటకి వెళ్ళమని చెప్పి, పాలేరుతో తాను తెచ్చిన సామాగ్రిని మంచం దగ్గర అమర్చమంటాడు. తానూ వేషం మార్చి మొహానికి బొట్లు పెట్టుకుని, చేతులకి, పొట్టకి భస్మం రాసుకుని భూత వైద్యుడిలా మారిపోతాడు కృష్ణ. అంతా సిద్ధం అయ్యాక పాలేరుని కూడా బయటకి పంపి, మంత్రాలు చదవడం ప్రారంభిస్తాడు. పది నిముషాలు కాలం గడిచాక మనోబ్రాంతిని కలిగించే కొన్ని మూలికలను తీసి ఒక రాయి పాత్రలో వేసి, పొడి చేసి, కాస్త మంట తీసుకుని ఆ పాత్రలో వేస్తాడు. తద్వారా వచ్చే పొగను శ్రీనివాస్ నాయుడు ముక్కు దగ్గర పెడతాడు, ఆ పొగ అంతా పీల్చుకున్న శ్రీనివాస్ నాయుడు పూర్తిగా కృష్ణ ఆదీనంలోకి వస్తాడు.

చెవుల దగ్గర చిటెక వేయగా, శ్రీనివాస్ నాయుడు శబ్దం వైపు కదులుతాడు, అప్పుడు కృష్ణ:

“నేను చెప్పినవన్నీ నిజంగా జరుగుతున్నాయి అని నువ్వు నమ్ముతున్నావు, నీలో ఉన్న దెయ్యాన్ని నేను పోగొడుతున్నాను. అందుకు నీ ధైర్యం కూడా ముఖ్యమే, దైర్యంగా ఉంటావా?”

“ఉంటాను”

“సరే, నీ శరీరంలో నుంచి నీ ఆత్మ బయటకి వస్తుంది, వచ్చిందా?”

“వచ్చింది”

“నీ ఆత్మ లేకపోయినా నీ దేహం కదులుతుందా?”

“కదులుతుంది”

“అందుకు కారణం నీలో ప్రవేశించిన దెయ్యం. దాన్ని బయటకి పంపాలంటే దీన్ని మించిన ప్రేతాలను ఆవాహన చేసి, నీ శరీరంలోనుండి ఈ దెయ్యాన్ని తీసేయమని చెప్పాలి.”

మంత్రాలు చదువుతాడు భూత వైద్యుడు కృష్ణ.

చీకటి నుండి మనిషి పుర్రెలు, విచిత్రమైన ఆకృతులతో, భయంకరమైన ధ్వనులు చేసుకుంటూ వస్తాయి, శ్రీనివాస్ నాయుడు ఆత్మ ఆ సంఘటనను చూసి వణికిపోగా; దరియం చెప్తాడు కృష్ణ. ఆ ప్రేతాలను తన మంత్ర శక్తితో ఆదీనం చేసుకుని, శ్రీనివాస్ నాయుడు దేహంలో ఉన్న దెయ్యాన్ని బయటకి తెమ్మని చెప్తాడు. అవి శ్రీనివాస్ నాయుడు దేహం చుట్టూ తిరిగి అతని నోటి ద్వారా దెయ్యాన్ని బయటకి లాగేస్తాయి. శ్రీనివాస్ నాయుడు దేహం నిర్జీవం అయిపోతుంది, అప్పుడు కృష్ణ నాయుడు ఆత్మను దేహంలోకి ప్రవేశింపజేస్తడు.

భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ

దాంతో బెల్లం శ్రీనివాస్ నాయుడు తనలోని దెయ్యం వదిలిపోయింది అని సంతోషించి కనులు తెరుస్తాడు.  కృష్ణకి ధన్యవాదాలు తెలిపి భార్యని లోపలకి రమ్మని పిలుస్తాడు, ఆమె భర్త సాధారణ స్థితికి రావడం చూసి సంతోషించి ఆయన్ని హత్తుకుంటుంది. పాలేరు కూడా చాలా సంతోషిస్తాడు. శ్రీనివాస్ నాయుడు భార్య, పరుగున బీరువా వద్దకు వెళ్లి చేతికి అందినంత డబ్బు తీసుకుని కృష్ణ చేతిలో పెడుతుంది. అవన్నీ రెండు వేల రూపాయల కట్టలే, కనీసం ఒక పదిహేను కట్టలైనా ఉంటాయి. కృష్ణ మోహంలో నవ్వు దాచుకుని, ఆ డబ్బు అంత మూలికల సంచిలో వేస్తాడు. అందరూ కృష్ణకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు తెలుపుతారు.

ఆ కృతజ్ఞతలలోనే కృష్ణకు ఇంకొక మాట వినిపిస్తుంది.

“You are under arrest.”

ఎవరు ఆ మాట అన్నారో చూడగా, పాలేరు. అతని చేతిలో తుపాకీ.

“నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావని నిరూపించడానికి ఇదంతా, నువ్వు చేసినదంతా CCTVలో రికార్డు అయింది. ఫ్రాడ్ చేసిన నేరం కింద నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తున్నాను” అని పాలేరులా నటించిన పోలీసు చెప్తాడు.

బెల్లం శ్రీనివాస్ నాయుడు కృష్ణ దగ్గరకు వచ్చి, “నేనే ఒక డాక్టర్ ని, నువ్వు నా దగ్గరకి వచ్చి భూత వైద్యుడు లా నటిస్తే ఎలా? నీ బండారం బయట పెట్టడానికి, నా నియోజకవర్గంలో ప్రజలను మూఢనమ్మకాలకు దూరంగా పెట్టడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు కదా విక్రమ్?”

“Yes, sir” అంగీకరిస్తాడు పాలేరు రూపంలో ఉన్న పోలీసు విక్రమ్.

కృష్ణ చేసేదేమి లేక విక్రమ్ తో బయటకి నడుస్తాడు. శ్రీనివాస్ నాయుడు, విక్రమ్ కి తన ఇచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమంటాడు. సర్వం కోల్పోయినవాడిలా చింతిస్తూ కృష్ణ వాహనం ఎక్కుతాడు, విక్రమ్, శ్రీనివాస్ నాయుడుకి సెల్యూట్ చేసి వాహనం స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ వైపు వెళ్తాడు.

అప్పటి వరకు మౌనంగా ఉన్న కృష్ణ, పోలీసు తో ఒక మాట అడుగుతాడు –

“నీ అసలు పేరు అశోకా? విక్రమా?”

పోలీసు బండి ఆపి, కృష్ణ వైపు నవ్వుతూ చూస్తాడు. తాను కృష్ణకి, శ్రీనివాస్ నాయుడుకి చెప్పిన పన్నాగాలు గుర్తుతెచ్చుకుంటాడు.

కృష్ణకు చెప్పిన పన్నాగం:

ఈ నియోజకవర్గం MLAకి దెయ్యం పడుతుందని అందరూ అనుకుంటారు. దెయ్యాల గురించి నీకు బాగా తెలుసు కదా, అవి నమ్మితే ఉంటాయి లేదంటే పోతాయి. ఆయన నమ్మకమే మనకి మార్గం; నేను వెళ్లి, నీ గురించి చెప్తాను. తప్పకుండా పిలిపిస్తారు. నీకున్న పరిజ్ఞానంతో ఏదోకటి చేసి ఆయనకీ నయం అయిపోయింది అని చెప్పు. నీకు తప్పకుండా భారీ బహుమానం ఇస్తారు. అందులో నాకు సగం ఇవ్వు. మనల్ని మళ్లీ వెంటాడి పట్టుకుంటారనే సందేహం వద్దు. నువ్వు ఎటైనా పారిపో, నన్ను ప్రతి పోలీస్ స్టేషన్ లో వెతుకుతారు – నేను దొరకను. ఎందుకంటే నేను అసలు పోలీసునే కాదు. ఏమంటావు?

MLAకు చెప్పిన పన్నాగం:

Sir , మన ఊరిలో మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోతున్నాయి, ఎవరో భూత వైద్యుడు కృష్ణ అంట, దెయ్యాల పేరు చెప్పి జనాల్ని దోపిడీ చేస్తున్నాడు. అప్పుడే నాకొక idea వచ్చింది. మీరెందుకు అతడ్ని పెట్టుకోకూడదు? అప్పుడు మీకు ప్రజలలో మంచి పేరు వస్తుంది, మంత్రి అయ్యే అవకాశం వస్తుంది. మీరు చేయాల్సినిది, ఒక్క రాత్రి దెయ్యం పట్టిన వారిలా నటించడమే! CCTV  పెట్టండి, మీ భార్య సహకారం తీసుకోండి, చివరిలో అతడి చేతిలో డబ్బు పెట్టండి. అదే సమయానికి నేను వాడ్ని arrest చేసి స్టేషన్ లో పడేస్తా. మీ డబ్బు ఆధారం కింద చూపి ప్రజలకు నిజం ఏంటో తెలియజేయండి, రెండు రోజులు పోయాక మీ డబ్బు మీకు తెచ్చి ఇస్తాను. నాకు పని అయిపోయాక ఒక ఐదు లక్షలు ఇవ్వండి చాలు. ఏమంటారు Sir?

Jeep బయట నిలుచుని నవ్వుకుంటారు ఇద్దరు. తన సంచిలోనుంచి డబ్బు తీసి విక్రమ్ ఉరఫ్ అశోక్ కి ఇస్తాడు. వాటిని చూడగానే అతను ఒక్కొక్క కట్టాను బొటనవేలితో ఆడిస్తూ వాసన చూస్తూ ఆనందపడతారు. కాసేపటికి స్పృహ కోల్పోయి కింద కూడా పడతాడు.

పన్నాగం గురించి చెప్పగానే, అశోక్ మామూలు వాడు కాదు అని గ్రహించిన కృష్ణ తన Tata Matador నుండి బయల్దేరేప్పుడు మత్తు మందు ఒక పొట్లం లా కట్టి మూలికల సంచిలో వేసుకుని వస్తాడు. నాయుడు భార్య డబ్బులు ఇవ్వగానే అవి సంచిలో పెడుతూనే, ఆ పొట్లం విప్పేసి డబ్బుకు తగిలేలా చేస్తాడు. ఆ డబ్బు వాసన చూడగానే అశోక్ స్పృహ కోల్పోతాడు. కృష్ణ, తన పన్నాగం ఫలించింది అని, అశోక్ ని Jeep ఎక్కించుకుని ఎవరు లేని దగ్గర ఆపి; నాలుగు రెండు వేల రూపాయిల కట్టలు అతని జేబులో పెట్టి, Jeep లో పడుకోపెట్టి వెళ్ళిపోతాడు.

కృష్ణ తన దగ్గర మిగిలిన మొత్తం లెక్కపెట్టగా, అవి ఇరవైరెండు [౨౨] లక్షలు అని తెలుసుకున్నాడు. ఇక నుండి భూత వైద్యం, మూలికా వైద్యం మానేసి, ఇదొక పల్లెటూరుకి వెళ్లి చిన్న ఇళ్లు కట్టుకుని, పొలం కొనుక్కుని, వ్యవసాయం చేసుకుందాం అని నిర్ణయించుకుంటాడు భూత వైద్యుడు కరివేపాకుల కృష్ణ.

Comments

comments