పిల్లల పెంపకం, చేపల పెంపకం – పద్ధతి, నివారణ, చర్య

ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే పదాలు వినడానికి చాలా బాగుంటాయి, తగు మోతాదులో పంచితే ఆచరణలో అద్భుతంగా ఉంటాయి. కానీ ఇవి మితిమీరితే; తల్లి తండ్రులు నీటి నుండి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటారు. పిల్లలు కూడా అంతే, మొదట్లో ముదిగారం చేస్తే తర్వాత భూమి మధ్యకి వెళ్లి బంగారం తీసుకురమ్మంటారు.

పిల్లల పెంపకం: నివారణ

మరి ఏమి చేయమంటారు అండి, మరీ గుక్క పెట్టి ఏడ్చేస్తాడు మా వాడు, ఏమైనా అడిగింది చేయకపోతే. ఏడిస్తే కన్నీరు వచ్చేవరకే బాధ, అడిగిందల్లా చేసుకుని పోతే పిల్లలు ఎలా తయారు అవుతారో తెలుసుకోండి.

అతి సున్నిత మనస్కులుగా మారిపోతారు

సున్నితంగా ఉండడం తప్పు కాదు, కానీ అది ఎక్కువ అయితే పిల్లలు పెద్ద అయ్యాక చాలా ఇబ్బందులు ఎదురుకుంటారు. ఎవరైనా ఒక్క మాట అంటే దాని గురించే ఆలోచిస్తూ కూర్చోవడం, ఇతరులతో మాట్లాడడానికి సందేహించడం, పని చేస్తే ఫలితాన్ని ఎదుటి వారు ఎలా స్వీకరిస్తారో అని భయపడడం లాంటివి అతి సున్నితమైన మనసుగల పిల్లలకు అలవాటు.

అనవసరమైన కోరికలు ఏర్పడడం

ఆడుకోడానికి బొమ్మ కావలి అనుకోవడం కోరిక, ఫలానా బాబు చేతిలో ఫలానా రోజు చుసిన బొమ్మనే అడగడం అనవసరమైన కోరిక. ఇలాంటి ఆలోచనల వలన పిల్లలు మొండి చేయడం మొదలుపెడతారు, ఎంత సర్ది చెప్పినా ఊరుకోరు. చేసేదేమి లేక కష్టపడో, నష్టపడో తల్లితండ్రులు అలంటి కోరికలు తీరుస్తారు. కానీ భవిష్యత్తులో పిల్లవాడు పెద్ద అయితే కోరికలు పెద్ద అవుతాయి, అప్పుడు ఏమి చేస్తారు?

తల్లితండ్రుల మీద ఆధారపడడం

పిల్లలు, తల్లితండ్రుల మీద ఆధారపడక అమెరికా ప్రెసిడెంట్ మీద ఆధారపడతారా? అని ఎదురు ప్రశ్న వేయొచ్చు మీరు. నిజమే! పిల్లల పెంపకం తల్లితండ్రుల మీదనే ఆధారపడి ఉండాలి. కానీ ఎంత వరకు? పెన్సిల్ కావాలంటే విదేశాల నుండి తెప్పించాలా? పది రూపాయలు అడిగితే, వంద రూపాయలు జేబీలో పెట్టాలా? క్రమేణా ఈ ఆధారపడడం అనేది అలవాటు అయ్యి, పిల్లలు కష్టపడకుండా అన్నిటికి అమ్మ-నాన్న ఉన్నారులే అని అలసత్వ ధోరణితో బతుకుతారు. 

కాసేపు ఈ భారమైన అంశాన్ని పక్కన పెట్టి చేపల పెంపకం గురించి మాట్లాడుకుందాము.

చేపల పెంపకం: పద్ధతి

చిన్న నలకలు లా కనిపించే చేప పిల్లలను కొని తెచ్చి నీటిలో వేస్తాడు జలవ్యవసాయం చేసే ఓ వ్యక్తి. అతనికి తెలుసు ఏ సమయంలో ఏమి చేయాలో, పూటకి ఆహరం, తగిన సమయంలో నీటి మార్పిడి, చెరువు శుభ్రం చేయడం, ఏరియేటర్ల ద్వారా గాలిని అందించడం, వ్యాధులు సోకకుండా కాపాడడం. ప్రక్రుతి ప్రళయాలు ఏమి రాకపోతే చేపలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, జల వ్యవసాయం ఫలితాన్ని, దానితో పాటు ధనాన్ని ఇస్తుంది.

పిల్లల పెంపకం, చేపల పెంపకం

పిల్లల పెంపకం : చర్య

తల్లి తండ్రులు చేయాల్సింది కూడా ఇదే. అవసరాలని చూసుకోవడం, కావాలి అన్నపుడు ప్రేమను పంచడం, తప్పదు అన్నపుడు శిక్షించడం, అండగా నిలవడం, కంటికి రెప్పలా కాపాడుకోవడం. వీటిని దాటితే పిల్లలు మొండిఘటాలు అయిపోతారు.

ఒక చిన్న గీత; ప్రేమకి, గారాబానికి మధ్యన ఉంటుంది. చేపల పెంపకంలో కూడా అంతే, తింటుంది కదా అని చేపకి డబ్బాలు డబ్బాలు మేత వేస్తే నీరు పాడైపోయి చేప చచ్చిపోతుంది. సంతోషంగా ఉన్నారు కదా అని పిల్లలు ఏమి అడిగితే అది చేస్తే, సమాజం అనే నీటిలో మీ పిల్లవాడు సర్దుకుపోలేక ఒడ్డుకి చేరాలి అనుకుంటాడు. ఒడ్డుకి చేరిన చేప భవిష్యత్తు ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాగ్రత్త అండోయ్.

Comments

comments