96 – ప్రేమే జీవితం |Vijay Sethupathi, Trisha Krishnan
ప్రేమ ఒక కావ్యం
ప్రేమ ఒక జ్ఞాపకం
ప్రేమ ఒక జీవితం
ఇటువంటి మాటలు ఈ రోజుల్లో చెప్తే, పాత చింతకాయ పచ్చడి అని ఆ మాటలని, వాటితో ఆ మాటలు చెప్పిన వ్యక్తిని కూడా బయటకి విసిరేస్తారు.
ప్రేమ ఒక అవసరం
అని అత్యధిక శాతం మంది భావించే ఈ రోజుల్లో దర్శకుడు ప్రేమ్ కుమార్; పాత పచ్చడి రుచి ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేయడానికి తీసిన ఓ మధురకావ్యం 96.
96 కథ
ఆకర్షణ ఏ వయసులో అయినా కలుగుతుంది, కానీ దాన్ని సరైన మార్గంలో నడుపగిలిగితే అదే స్వచ్ఛమైన ప్రేమగా పరిమళిస్తుంది. ఈ చిత్రంలో కే రామచంద్రన్, ఎస్ జానకి దేవి పాఠశాలలో ప్రేమించుకుంటారు. చూపులు, సైగలు, ఊసులు, కవ్వింతలు, విమర్శలు, పాటలు… ఇవే వారి ప్రేమలో కనిపిస్తాయి. ఎక్కడా అసభ్యంగా చూపడం కానీ, హద్దులు దాటడం కానీ ఉండవు. అనుకోని పరిణామాల వలన విడిపోతారు. దశాబ్దాలు కలుసుకోరు, జానకి పెళ్లి చేసుకుంటుంది, రామచంద్రన్ తన జ్ఞాపకాలతోనే గడుపుతూ photographer గా మారి దేశ సంచారం చేస్తుంటాడు. అలా ఒక రోజు తన పాఠశాలకు వస్తాడు, అందరిని చూడాలి అనిపిస్తుంది. దానితో 96 లో చదివిన వారంతా కలుస్తారు. అలా కలిసిన సమయంలో రామచంద్రన్, జానకి దేవి మధ్య ఏమి జరుగుతుంది అనేదే కథ.
రామచంద్రన్ గా ఆదిత్య భాస్కర్ [చిన్నప్పుడు], విజయ్ సేతుపతి; జానకి దేవి గా గౌరీ కిషన్ [చిన్నప్పుడు], త్రిష కనబరిచే నటన 96 చిత్రాన్ని ఒక దృశ్య కావ్యాన్ని చేస్తాయి.
ఈ చిత్రానికి ఇంకొక ముఖ్యమైన చేరిక సంగీతం. ఎనిమిది పాటలు, ప్రతి నిముషం మన చెవులకి ఆనందాన్ని ఇచ్చే నేపధ్య సంగీతం. తరతరాలు వినే సంగీతం ఇచ్చారు గోవింద్ వసంత.
ఇవన్నీ చాలవు అన్నట్టు “యమునా తటిలో” [దళపతి చిత్రంలోనిది] అనే పాటకు ఇచ్చిన ప్రాముఖ్యత చాలా ఆకట్టుకుంటుంది.
కొసమెరుపు: ఈ చిత్రంలో ప్రతి సన్నివేశానికి కథ అనుగుణంగా ఉరకలెత్తే ప్రవాహానికి ఎంత ప్రాముఖ్యతని ఇచ్చారు అంటే; ఆ ప్రవాహాన్ని పక్క దారి పట్టిస్తుందేమో అని ప్రముఖ గాయకురాలు జానకి దేవిగారితో తీసిన సన్నివేశాలను కూడా పక్కన పెట్టేసారు.
96 లో మర్చిపోలేని సన్నివేశాలు:
> జానూ పేరు వినగానే రామచంద్రన్ చుట్టూ శబ్దం ఆగిపోతుంది. తన ప్రేమ గురించి ఆలోచనతో గతంలోకి జారుకుంటారు రామ్. అలాగే రామచంద్రన్ పేరు వినగానే జానకి దేవి చుట్టూ శబ్దం ఆగిపోతుంది. తన రామచంద్రన్ ఎక్కడ ఉన్నాడో చూడడానికి ఆతృతగా వెళ్తుంది జానకి.
> జ్వరంతో చాలా రోజులు పాఠశాలకు రాణి జానకి, అదే జ్వరంతో బాధపడుతూ పాఠశాలకు వచ్చి రామచంద్రన్ వంక ప్రేమతో నవ్వి, బాధని మర్చిపోయిన దానిలా మారిపోతుంది.
> రామచంద్రన్ గుండె మీద జానకి చేయి వేయగానే, రామ్ గుండె వేగం పెరిగి, చెమటలు పట్టి, స్పృహ కోల్పోవడం.
> జానకి, రామచంద్రన్ విద్యార్థులకు “ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేది” అని ప్రేక్షకులు అనుకునేలా ఒక కథ చెప్తుంది. ఆ సమయం లో రామచంద్రన్ హావభావాలు 96 చిత్రానికే ఒక అద్భుతం.
చివరిగా:
ఈ చిత్రం చూడమని చెప్పిన వారు, చూసాక ఒక ప్రశ్న వేశారు – “ఎంత నచ్చింది?” అని. ఎంత అంటే:
రాత్రికి జాబిలంత,
తొలకరికి చిగురంత,
మనసుకి ప్రేమంత…
ఈ చిత్రం చూసిన ప్రతి వ్యక్తి [ప్రేమ గురించి తెలిసినవారు] కే రామచంద్రన్ లా ప్రేమని ఆరాధించాలి అనుకుంటారు, ఎస్ జానకి దేవి లా గుండె పగిలేలా ఏడవాలి అనుకుంటారు.
ఈ పాత చింతకాయ పచ్చడి మీ రుచులకు అద్భుతంగా సరిపోతుంది, వెళ్లి రుచి చూడండి, కన్నీరు కార్చండి, ఆస్వాదించండి, ప్రేమించండి.