సింహం, మేక, మధ్యలో నక్క…
అనగనగా ఒక మహారణ్యంలో, ఆరోగ్యం బాగోలేని సింహం ఒకటి దగ్గుతూ, తుమ్ముతూ బతుకుతుంది. అరణ్యానికి రాజు అయిన సింహానికి చావు సమీపిస్తోంది అనగా ఒక కోరిక కలుగుతుంది, అదేమనగా, ఆ అరణ్యంలోనే బాగా పెద్దదిగా ధృడంగా ఉన్న మేకను తినాలి అనిపిస్తుంది. వెంటనే సింహరాజం, తన మంత్రి, స్నేహితుడు అయిన నక్కను పిలిచి తన కోరికను వివరిస్తుంది.
నక్క, సింహం తనకి ఎన్నో సార్లు సహాయం చేసిందని, మంత్రిగా నియమించుకుని ఆడుకుంటుంది అని, సింహానికి ఎలా అయినా తన ఆఖరి కోరిక తీర్చాలని అరణ్యంలోకి గుహలోనుండి బయటకొచ్చి మేకల కోసం గాలిస్తుంది. ఎన్నో గుంపుల మేకలను చూస్తుంది కానీ, సింహరాజం మనసు తృప్తి పడే అంత ఆరోగ్యవంతమైన, బలిష్టమైన మేక నక్కకు కనిపించదు. రోజంతా తిరిగి అలసిపోయిన నక్క ఒక పెద్ద తుమ్మ చెట్టు నీడలో అలసట తీర్చుకుందాం అని అనుకుంటుంది. చెట్టు నీడలో ప్రశాంతంగా పడుకున్న నక్కకు దూరంలో “మెహెహె, మెహెహె” అని మేక అరుపులు వినిపిస్తాయి. నక్క చెట్టు మాటున చేరి చూడగా బలిష్టంగా ఉన్న తెలుపు వర్ణం మేక కనిపిస్తుంది; వెంటనే నక్క దాని ముందుకు వెళ్లి:
“ప్రణామం, మేక మిత్రమా, నీ దగ్గరకు ఒక శుభవార్త తీసుకువచ్చాను. మన సింహారాజు అనారోగ్యం పాలయ్యారు, చావుకి సమీపంలో ఉన్నారు. కావున, సత్వర పరిష్కారంగా అరణ్యానికి తర్వాత రాజు ఎవరిని చేయాలా అని ఆలోచించారు. నన్ను అడగగా, నేను మంత్రిగా సలహాలు ఇవ్వడానికే బాగుంటాను అని చెప్పను, అడవి పందికేమో జ్ఞానం తక్కువ, ఎలుగుబంటికి నిద్రెక్కువ, పులికి జంబాలెక్కువ, ఏనుగు మరీ నెమ్మది, ఎవరా ఎవరా అని ఆలోచించగా మేక అయితే ఎలా ఉంటుంది అని ఇద్దరం అనుకున్నాము. మేక చురుకైనది, తెలివైనది, ప్రమాదాలు కనిపెట్టగలదు, కొమ్ములతో పోరాటం చేయగలదు, అందుకే రాజసం ఉన్న మేక కోసం వెతుకుతున్నాను. అదృష్టంకొద్దీ నువ్వు కనిపించావు, నీకు ఇష్టం అయితే నాతో రా, లేదంటే నాకు సమయం తక్కువ ఉంది, ఇంకో మేకని వెతుక్కోవాలి.”
నక్క మాటలు వినగానే మేక గర్వంతో నిండిపోయింది. ఒక్క సందేహం కూడా వ్యక్తపరచకుండా నక్కతో సింహం గుహకి వెళ్ళింది. మేకను చూడగానే సింహం నవ్వుతూ పలకరించి, ఒక్క సరిగా మేక మీద పంజా విసురుతుంది, మేక చెవు తెగుతుంది. సింహం తనని చంపడానికి చూస్తుంది అని మేక భయంతో గుహ నుండి పారిపోతుంది. సింహం, తన ఆహరం దక్కలేదు అని దద్దరిల్లిపోయేలా గాండ్రిస్తుంది. అది చూసిన నక్క, “ఇంకొక్క సారి మాత్రమే నేను ఆ మేకను తీసుకురాగలను, అప్పుడు కూడా నువ్వు దాన్ని చంపలేకపోతే నేను ఏమి చేయలేను మహారాజా” అని చెప్తుంది. సింహరాజం ఎలా అయినా ఆ మేకనే తినాలని ఆశపడుతుంది. నక్క మాటలకు సరే అని చెప్పి, గుహలో విశ్రాంతి తీసుకుంటుంది సింహం.
నక్క, మేక వాసన పసిగట్టి దాని ముందు వెళ్లి కోపంగా మొహం పెట్టి: “నీకు అసలు బుద్ధి ఉందా? రాజా శాసనాలు నీ చెవిలో చెప్పడానికి వచ్చిన సింహరాజుని చూసి పారిపోతావా? అంత పిరికి దానివి రాజ్యమేలా ఏలుతావు? నిన్ను తీసుకెళ్ళినందుకు నా మీద విరుచుకుపడ్డారు సింహరాజు. ఈ సారి అయినా దైర్యంగా ఆయన ముందు ఉండు, లేదంటే ఈ అరణ్యానికి ఇంకొక రాజుని వెతుకుతాం”.
సింహాన్ని అపార్థం చేసుకున్నాని విచారిస్తూ మేక, నక్కతో కలిసి సింహం గుహకి బయల్దేరుతుంది. ఈ సారి ధైర్యంగా సింహరాజం ముందు నిలబడుతుంది మేక. సింహం ఒక్క దెబ్బతో మేకను చంపేసి, తృప్తిగా ఆరగిస్తుంది. నక్క తన కష్టానికి ప్రతిఫలంగా మేక మెదడును ఆరగిస్తుంది. అది చూడని సింహరాజం, మేక మెదడు కోసం వెతకగా, నక్క నవ్వుతూ, ఇలా సమాధానం చెప్తుంది:
“మేకకి మెదడు ఉంటే రెండో సారి మీ గుహలోకి ఎలా అడుగుపెడుతుంది.”
నీతి: గర్వంతో కళ్ళు మూసుకుపోయినపుడు ప్రమాదాల బారిన పడకతప్పదు.
Source: The Lion, The Fox and the Stag by Aesop