పంచభూతములు – ఆలోచనలు , ఆక్రందనలు
౧
బ్రతుకు చెరను విడవజూచి ప్రేతమొక్కటినైతి,
గగన మార్గమున తీసుకెళ్ల భటులిద్దరు రాకపోతిరి,
కర్మ నిండక, కుండ కాలక భూతములతో కలిగె మైతిరి,
పంచభూత భాష్యమెల్ల తెలిసి ఇచట తెల్పగోరితి.
౨
సహనంబు వీడి రోదించే భూమి :
“భవభందముల్ వలచి సృష్టినే మరిచేను మనిషి,
మోయునట్టి ధరిత్రిని దరిద్రమని అజ్ఞానంబుతొ తలిచె,
చేరు గమ్యాన్ని పతనంజేసె, తొలిచి తొలిచి హృదయంబున పొడిచె,
కప్పుటకు మన్ను లేక, మట్టి భిక్షమెత్తుకోవలె కపట మహర్షి.”
3
పద్మంబున ఆసీనమై ఆకాశం అక్కసుతో పలికె:
“జీవంబున ఆకాశంబు పర్యాయమై వెలుగు సమస్తాన,
కురచ, కలహ, కలుషిత బుద్దితో కల్లోలమయ్యే జీవుండు,
నిర్మలాకాశాన్ని ఆవిరిజేసి కుళ్ళు వాసనతొ నిండిపోయే మనుజుండు,
ఈశ్వరుని కృప లేని మురుగు జాతి ఒక్కటే ఈ లోకాన.”
౪
వానర రూపానజేరి వాయువు పౌరుషవాక్యముల్ తెలిపె:
“దుర్మదంబున సర్వాంతర్యామిగా నిలిచె నీచ నరము,
కుసుమ సంపదల్ మోయునట్టి నాచే మురుగు వాసనల్ మోయించె నియంతై,
శవముల్, నికృష్టముల్, అష్టదరిద్రముల్ నే పట్టితి నపుంసకునిజేత వానరమై,
స్వచ్ఛమెరుగడు శ్వాస వీడినా, అసువులొదలక విషముగ్రక్కు ఈ సర్పము.”
౫
వాయు చక్షువున బాష్పబిందువై జారుతూ ఇట్లనె జలంబు:
వేడిమి మోయ, వెన్నెల జూడ, జీవాన్ని బ్రోవ పంపే ఈశ్వరుడు
మురిపాల ముత్యాల యువరాణినే, కబళించి మైలపరిచె
ద్రోహమొనర్చెనని మేఘమాల నీరసించి తునకలై నల్దిక్కుల్ రోదించె,
అది జూచి నవ్వుతూ మలం, మూత్రం, గరళం తాగమని చెప్పెనయ్యో పామరుఁడు.
౬
నిరాకారాగ్ని రగులుతూ జెప్పె:
“సమిద, దర్భ, సోమరస, నేతిన్ ఆరగింప యుగము కాదిది,
పడతి కన్నీరు, స్వేదము, రక్తము, వీర్యము అంభోజుని దర్పణమనే,
కుహురానవెల్గె ఆత్మతత్వమున్, మొహంగాలలోదోసి కామతత్వమున్ వెలిగించమనే,
కలి దోషంబు కాదు, మనుజుండి ప్రళయమేధస్సు పాపాగ్ని శిఖల కాష్టంతో నిండిన అంబుధి.”
౭
“జరామరణములకు సాక్షియే కదా జీవితం,
పుట్టుకెఱగవు చావునెఱగవు మధ్యనున్న మీమాంసనెరుగవు,
తోలునెల్ల కామించజూచి ఆత్మ డొల్లగా జేసుకొనెదవు,
నేడు కాసి రేపు రాలే బ్రతుకు కోసం ఎందుకింత సంకటం?”
క్లుప్తంగా: జీవితం మీద ఆసక్తి కోల్పోయి ప్రాణాలు ఒదిలి ప్రేతముగా మారిన కవికి పంచభూతములు పరిచయం అవుతాయి. యమధర్మరాజు వద్దకు తీసుకెళ్లడానికి భటులు రాక ఆలస్యం అవ్వడంతో కవికి పంచభూతములు వాటి గోడును తెలియజేస్తాయి.
భూదేవి మట్టిని మలినాలతో నింపేసి, జీవం లేకుండా చేస్తున్నాడు మనిషి అని తెలియజేస్తుంది.
ఆకాశం తన నిర్మలత్వాన్ని పోగొట్టుకుంటుందని, కుళ్ళు వాసనతో, రాయణపు పోగలతో తనని సతమతమయ్యేలా చేస్తున్నారని చెప్తాడు.
వాయువు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా అష్టదరిద్రాలే చూడవలసి వస్తుందని బాధపడతాడు.
నీరు, మనిషి వికృత వైఖరికి మైలుపడ్డానని, దాని వలన మేఘముతో స్నేహం కోల్పోగా అది నీరు లేక చనిపోతుందని దుఃఖపడింది.
అగ్ని కలి యుగంలో మానవుని ఆలోచనలు ఎంత హీనంగా మారిపోయాయో తెలుపుతాడు.
ఇవన్నీ విని, అర్ధం చేసుకుని ప్రేతమైన కవి పంచభూతముల బాధను తత్వముగా మలచి మానవాళిని ప్రశ్నిస్తాడు.