నా రాధ – శ్రీ కృష్ణుని హృదయ తపము
మదియందు కల్లోలము ,
ఉష్ణోగ్రమున్ వేగలేక వివర్ణమౌ పింఛము…
మ్రోగుటకు వేణువు ఊపిరేది అనగా,
మురారిన్ జూచి వాయువు పాడలేననగా…
వనమాలిని గాంచి పుష్పించుట మరిచె వనముల్,
మధుభాషనుండి మౌనమున్ గ్రహింపలేక ఊగాడె పద్మముల్…
ఉద్యానవనంబున పెరిగెనొక విచారంబు శ్రీ కృష్ణుని యదలోన
నీట కన్నీరు చేరి, తడబాటుతో కదిలె జీవము కొలనులోన…
“కుసుమ ప్రియా నయన, కమలాకర హృదయ చోర,
రసరంజకమౌ నీ గానమున్ వినుటకు తపియించె మనసారా,
సంకల్ప-వికల్పముల్ నొదిలి నీ ఆరాధ భూషణముల్ ధరియించినా?
స్వరూపంబు మార్చి సుస్వరమైన ఆలాపనై నీ పెదవున జనియించినా?
ఓ రాధా, పసిడివై భువియందు దాగినావో, సోయగాల అలవై కడలియందు చేరినావో,
వాయిద్యమున్ బట్టి ఏ బాటలో కేగినావో, పదముగా మారి ఏ కీర్తనలో కలిసినావో…
జలము లేని మత్స్యమై ప్రాణమంతా మండుతుండె,
సోకమెల్ల కూర్మమై మేను వీడి వెళ్లకుండె,
ఎడబాటు బుట్టె భవితన్ అగాధముల్ జేసి సంతసించుటకై…”
శ్రీ హరికైన తప్పునా, ప్రేమ పెట్టు వేదన, కబళించిన, ప్రాణమై
“తన్మయ కోమల మృదువల్లీ, హరి హరణ కోమలాంగి,
నీ చరణముల్ స్పృశియించ మన్మధుండు అయ్యానేమో భైరాగి,
గూడమున్ బెట్టి, పట్ట జంకుతూ మధనపడుతుండేనేమో మర్కట మనఃదరుడు,
లేకున్న నిత్య మనోహరమౌ నీ గానమున్ శ్రవణమున చేర్చడా పవనుండు…
అవనిగాచు వరాహమై, చెలినిబ్రోవు నృసింహమై లోకమెల్ల గాలించనా?
వామనుండనై ముల్లోకముల్, మురిపించు ముత్యానికై వెతుకాడనా?
అనురాగంబునకు క్షేత్రమౌ గుండెను గొడ్డలెంచి తొలిచివేయనా?
బాధనెల్ల దిగమింగి, రాముడై సుశీల కొఱకు వెతుకుతుండనా?
శంఖుచక్రనామాన్ని త్యజియించి నీ నామమే ధరించనా – రా-ధి-క!!!
నిర్జీవమైనా, విశ్వా౦తమైనా, అమరమవ్వదా దేవతతో ఈ భక్తుని కలయిక…”
రాధికాత్ముండు, సఖిని కోరి ఉద్యానంబున జపము చేసే
అయ్యో గోపాలుండు లోతెరగని విచారంబున పూడిపోయే,
పాపం అనుచు లోకమెల్ల దుఃఖ సగరమున మునుగాడెనే,
వృక్షమెంచి కోయిలలు విషాదమై రోదించె,
మనసు కరిగి ప్రకృతమ్మ బుజ్జగించ చినుకు కార్చె…
శ్రీ కృష్ణుని కోరి రాధ ఎన్ని విధాలుగా బాధ పడినదో, కీర్తించినదో మనము ఎన్నో పుస్తకాలలో చూస్తుంటాము. రాధ పడే వేదన కొఱకే ప్రత్యేకంగా రచనలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరు కుడా శ్రీ కృష్ణుడు మదిలోని ఆలోచనలను వర్ణించరు. రాధమ్మకేనా బాధ? కన్నయ్యకి ఉండదా? అనే ఆలోచన నుండి పుట్టినదే “నా రాధ” అనే కవిత.
వ్రాసినది: తేజ బసిరెడ్డి