ఎలుక సహవాసం, కప్ప ఉన్మాదం – లేనూరు కథలు

లేనూరు అనే గ్రామం దగ్గర ఒక ఏరు పారుతుండేది, అది ఎన్నో జీవులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పించేది. ఆ ఏటి వద్ద కీటకాలను పట్టుకుని జీవించేవి ఒక ఎలుక కుటుంబం. అవి ఏటి గట్టు దగ్గరే బొరియ చేసుకుని ఉండగా, అదే ఏటి దగ్గర కప్పల సమూహం ఉండేది. అందులో కప్పలన్నీ మిక్కిలి స్నేహపూర్వకంగా మసులుకుంటూ ఉండేవి. అయితే అందులో ఒక మండూకము మాత్రం మిక్కిలి క్రూర బుద్ధితో ఉండి, ఎవ్వరూ చూడనప్పుడు తనకంటే చిన్న జీవులను చిత్రహింసలకు గురిచేస్తూ ఆనందం పొందేది. ఇలా కొంత కాలం గడిచాక ఆ ఉన్మాద మండూకమునకు చిన్న జీవుల మీద ఆసక్తి పోయి తనతో సమానమైన జీవులను వేదించాలని కోరిక కలిగెను.

తన కోరిక తీర్చుకొనుటకు ఎవరిని వలలో వేసుకోవాలా అని చూస్తుండగా, బొరియలోనున్న ఎలుకలకు నూతన సంతానం కలిగిందని తెలుసుకుని కుటిలోపాయము పన్నెను. ఏటి గట్టుకి వచ్చిన కొత్త జీవాన్ని చూడటానికి వెళ్లినట్టు వెళ్లి ఆ ఎలుకను ఎంతో పరీక్షగా చూసి, “ఈ మూషికమే నా కోరిక తీర్చుటకు సరైనది” అని తలచి, ఆ నాటి నుండి దానితో ఎంతో సన్నిహితముగా ఉండెను.

సహజంగా మృదుస్వభావులైన కప్పలను ఆదరించే ఎలుకలు, తమ కుమారుడికి మంచి తోడు దొరికేనని ఆనందపడెను. అలా మూషిక-మండూక సహవాసం మొదలై, వారిద్దరిది ఆదర్శమైన మిత్రత్వం అని అందరూ భావించెను. ఎలుక పరిమాణం పెరుగుతూ ఉండగా, కప్ప తన కోరికను చంపుకోలేక ఎప్పుడెప్పుడు ఎలుకను చిత్రహింసలకు గురిచేద్దామా అని ఎదురు చూడసాగింది. వర్షాకాలమున ఒక నాడు, ఎలుక తనకంటే పెద్దది అయినదని గ్రహించిన మండూకము, తన కోరిక తీర్చుకొనుటకు ఉపక్రమించెను. బొరియ దగ్గరకు వెళ్లి, “మిత్రమా, ఈ రోజు కొత్త ప్రదేశానికి వెళ్లి ఆడుకుందాము, ఉప్పెనలా వస్తున్న నీటి వలన మనము ఇక్కడ ఆడుట శ్రేయోదాయకము కాదు.” మిత్రుని మాటను అంగీకరించిన మూషికము అతనితో గట్టు దాటి, రాళ్ళ గుట్ట వద్దకు చేరుకున్నారు. 

ఆ గుట్ట పైకి ఎక్కి, కిందకి దిగి, నవ్వుతూ ఇద్దరూ సమయం గడిపారు. కప్ప రాళ్ళ గుట్ట పైకి ఎక్కగా, ఎలుక కింద నుంచి వేడుక చూస్తుంది; ఇంతలో, ఒక పెద్ద రాయిని కప్ప తన బలమంతా ఉపయోగించి కిందకి దొర్లించెను. ఆ రాయి కిందకి దొర్లడంతో ఎటు వెళ్లాలో దిక్కుతోచని ఎలుక అక్కడే ఉండిపోగా, ఆ రాయి దాని తలకు తగిలి అది కుప్పకూలిపోయెను. అపస్మారకస్థితిలో ఉన్న ఎలుకను చూసి, క్రూరత్వాన్ని చర్మముగా మలుచుకుని, ఉన్మాదాన్ని జీవముగా చేసుకుని దాని వైపు ఎగిరెను కప్ప. తన కాలుకు, ఎలుక కాలును కట్టుకుని పైకి ఎగురుతూ, ఎలుకకు దెబ్బ తగిలినప్పుడల్లా సంతోషపడెను. తనలో రేగిన దుష్టత్వం చల్లారే వరకు ఎగిరి, కోరిక తీరినదై, ఎలుకను ముంచి చంపుటకు ఏటిలోకి దూకేను. నీరు తగిలి గాలి అందక ఎలుక నరకం అనుభవిస్తుంటే, కప్ప దాని మొహం దగ్గర మొహం పెట్టి “బెక బెక” అని చప్పుడు చేసెను.

ఎలుక సహవాసం, కప్ప ఉన్మాదం - లేనూరు కథలు

తన పరిస్థితిని నమ్మలేని, నమ్మకద్రోహానికి గురైన మూషికము జాలి కొలుపు చూపులతో, “మిత్రమా!” అని శ్వాస విడిచెను. ప్రాణము విడువగానే ఎలుక నీటి మీద తేలుతూ కొట్టుకుని పోగా, కప్ప కూడా ఎలుకతో కొట్టుకునిపోసాగెను. తాను కట్టిన సూత్రం ఎంతటి రాకపోవడంతో నీటిలోనే ఉండిపోయెను కప్ప. కొంత సమయానికి, భూలోకానికి పరలోకానికి వారధి వలెనున్న సొరంగం వద్ద చిక్కుకొనెను ఎలుక మృతదేహం. నాలుగు రెక్కలతో, రక్తంతో తడిచి రక్తవర్ణమైన ముక్కుతో దైత్యుల సాదు జంతువు వలెనున్న గద్ద ఒకటి ఆ మూషికాన్ని చూసేను. క్షణం ఆలస్యం చేయకుండా, రెక్కలు విదిల్చి ఆ ఎలుకను పట్టుకుని పైకి ఎగురగా, దానితో పాటు కప్ప కూడా నీటి నుండి పైకి వచ్చెను.  

ఆపదను గ్రహించిన కప్ప, తననితాను విడిపించుకొనుటకు ప్రయత్నించగా గద్ద తన ముక్కుతో దాన్ని పొడిచి చంపెను, అదే క్రమంలో సూత్రం తెగిపోగా ఆ ఎలుక సొరంగంలో పడిపోయెను. గద్ద, తనకు దొరికిన కప్పను తీసుకువెళ్లి భాగభాగాలుగా చేసి ఆరగించెను. ఆ సొరంగంలో పడినంతనే ఎలుక సజీవమై, “బ్రతుకు జీవుడా” అనుకుని తన బొరియాకు చేరి జరిగినదంతా చెప్పెను. అప్పటి నుండి ఎలుకలు కప్పలతో సహవాసం చేయక ఏటి నుండి దూరంగా బతకడం ఆరంభించాయి. తమ జాతిలో ఒకటైన మండూకము తమకు తలవంపులు తీసుకురావడంతో  కప్పలు బహిరంగ సంచారం తగ్గించుకుని నీటి దగ్గరే జీవించసాగాయి.

Comments

comments