రక్తం రుచి మరిగిన కొండముచ్చులు
సింహాచలంలో నివసించే వారికి అడవి పందులు, కుక్కలు, కుందేళ్లు వంటి జంతువుల్ని చూడటం కొత్తేమి కాదు. కొన్నిసార్లు చిరుతపులి జాడలు కనిపించడం కూడా సాధారణ విషయమే ఇక్కడ వారికి. కానీ ఆరోజు రాత్రి మాత్రం ఇంటి దగ్గర కుక్కలు ఒకటే గోల, అవి మొరుగుతుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి.
నిద్ర మాయం అయిపోయింది, ఇక చేసేదేమి లేక ఆ కుక్కల బాధ ఏంటో చూద్దాం అని కిటికీ దగ్గర నిల్చున్నాను. వీధి దీపాల వెలుతురులో నాలుగు కుక్కలు సపోటా చెట్టు వైపు చూసి మొరుగుతున్నాయి. ఆ కుక్కల్ని ఇది వరకు మా ప్రాంతంలో చూడలేదు – రెండు Doberman జాతివి, రెండు Rottweiler జాతివి. వాటిని చూడగానే కాస్త భయం వేసింది, కాసేపటికి వాటి అరుపులు అలవాటు అయిపోయి, నిద్రపోయాను.
ఉదయం లేవగానే పళ్ళు కూడా తోముకుండా మా వెనుక సందులో ఉండే colonel బాబాయ్ ఇంటికి వెళ్ళాను, కుక్కల గురించి ఆరా తీయడానికి. ఆయన ఇంటి బయట వేప పుల్ల నములుతూ కనిపించారు. ఒక నవ్వు విసిరి విషయంలోకి దిగాను,
“బాబాయ్ రాత్రి మా వీధి సపోటా చెట్టు దగ్గర రాత్రంతా కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి, వాటిని ఇంతకు ముందు ఇక్కడ చూడలేదు, మీకు తెలిసే ఉంటుంది అవి ఎవరివో!!!”
“ఈ ఊరిలో దాదాపు అందరి దగ్గర కుక్కలు ఉంటాయి రా, అవి ఎవరివో నాకు ఎలా తెలుస్తుంది. ఇంతకీ అవి ఏ జాతి కుక్కలు?”
“Doberman, Rottweiler జాతివి.”
“ఆహా, అవా, అవి కనకలక్ష్మి గారి కుక్కలు రా, అవి నీకు కనిపించాయంటే ఆశ్చర్యమే!!!”
నాకు ఆ కనకలక్ష్మి గారు ఎవరో తెలిస్తే కదా “అవునా” అనడానికి…
మాటలు పూర్తయ్యేలోపు బాబాయ్ కి ఫోన్ వచ్చింది, వెంటనే పని ఉంది మరల కలుద్దాం అని చెప్పి ఆయన లోపలకి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి మళ్ళీ కుక్కలు మొరిగాయి, ఈ సారి కొంచెం ధైర్యం చేసి కిటికీలో నుంచి వాటిని అదిలించాను, నా అరుపుకో తెలియదు, వాటి పని అయిపోయిందో తెలియదు, అవి ఒక్కసారిగా కనపడలేదు. చెట్టు వైపు torch వేసి చూడగా అక్కడ ఏమీ కనపడలేదు. కనీసం ఒక గుడ్లగూబ కూడా లేదు.
ఆ రోజు ఉదయం మళ్ళీ బాబాయ్ దగ్గరకి వెళ్ళాను అసలు ఈ కుక్కల విషయం ఏంటి, చుట్టు పక్క వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని. బాబాయ్ అప్పటికే బండి ఎక్కుతున్నారు బయటకి వెళ్ళిపోడానికి, నేను అది పట్టించుకోలేదు.
“ఆ కుక్కల అరుపులు వినలేకపోతున్నాను బాబాయ్, ఏదోకటి చేయాలి”.
“అవి ఊరికే అరవవు లేరా, వాటికి ఒక కథ ఉంది.” బండి ఆపి వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు బాబాయ్. తాను చెప్తుంది కొనసాగిస్తూ:
“కనకలక్ష్మి గారికి పెరట్లో బంగాళాదుంప తోట ఉంది, ఆమెకు ఆ తోట అంటే చాలా ఇష్టం, మన ఊరిలో అన్ని జంతువులు ఉంటాయి కానీ కొండముచ్చులు అరుదు. అవి వచ్చినప్పుడల్లా, ఆమె తోట మీద పది, దుంపలు లాగేసి మొత్తం నాశనం చేసేస్తాయి, చేసేదేమి లేక ఆమె కుక్కలని వదులుతారు.”
నాకు అయన చెప్పింది అర్ధం అయ్యేలోపు బండి ఎక్కి వెళ్ళిపోయాడు బాబాయ్, ఒక చిరునవ్వు నా మొహాన పడేసి. ఆ నవ్వులో ఆత్రుతని, ఆనందాన్ని, ఆసక్తిని వెతుక్కోవచ్చు. అలా ఆయన నవ్వడం మొదటి సారి చూడటం.
నేను సింహాచలం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది, ఇంత వరకు నేను కొండముచ్చులని చూడటం కానీ, వాటి ప్రస్తావన ఒకరి దగ్గర రావడం కానీ జరగలేదు. మూడవ రోజు, పౌర్ణమి, ఆ కుక్కలకు నిజంగా కొండముచ్చులు కనిపిస్తున్నాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగింది. నిద్రపోకుండా వాటి కోసం మంచం మీద కూర్చుని ఎదురు చూస్తున్నాను.
మంచం మీద ఉంది మెలుకువగా ఉండడం చాలా కష్టం, తెలియకుండా నిద్రపోయాను. ఒక్క సారిగా “ఆఆఆఆ…” అని ఒక ఆడగొంతు వినిపించింది, ఆ శబ్దం తర్వాత కుక్కలు రోజూకంటే బిగ్గరగా మొరగడం వినిపించింది. పరుగున గుమ్మం దగ్గరకి వెళ్లి సపోటా చెట్టు వైపు చూడగా, కొండముచ్చులు. ఒక ఆవిడ మీద పడి [ఆమె కనకమహాలక్ష్మి అయుంటుంది అనుకున్నాను], దాడి చేస్తున్నాయి. రక్తం వచ్చేలా కరిచేస్తున్నాయి, అందులో నాయకుడు అనుకుంటా ఒక కొండముచ్చు, ఆమె గొంతు కొరికి రక్తం తాగుతుంది. కుక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి, ఆమెను వదలలేదు. ఆమె శరీరమంతా రక్తసిక్తం అయింది, తెల్లని కొండముచ్చులు కాస్త ఎర్రగా మారి పున్నమి వెన్నలకి రక్త పిశాచాల్లా కనిపిస్తున్నాయి.
అచేతనంగా ఉండిపోయాను నేను, కాలి గోరు దగ్గర నుండి నెత్తి మీద వెంట్రుకల వరకు భయంతో కంపించుకుపోతున్నాయి. అచేతనంగా ఉండిపోయాను నేను, కాలి గోరు దగ్గర నుండి నెత్తి మీద వెంట్రుకల వరకు భయంతో కంపించుకుపోతున్నాయి. అప్రయత్నంగా చేతిలో ఉన్న torch నేల మీద పడి, మా ఇనుప gate కి తగిలింది. అది ఎక్కువ శబ్దం రావడంతో కుక్కలు, కొండముచ్చులు నా వైపు చూశాయి. నేను ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాను.
కంట్లో నుంచి చెమట కారుతుందో, నీరు కారుతుందో తెలియట్లేదు నాకు. కనులు గట్టిగా మూసుకుని అలా నిలబడ్డాను. ఒక్కసారిగా నిశ్శబ్దం నా మెదడును కమ్మింది, కుక్కల మూలగడం, ఆమె ఆర్తనాదాలు, కొండముచ్చులు చేసే కిరాతకమైన శబ్దాలు – ఏమీ వినిపించట్లేదు.
చాలా సేపు శిలలా ఉండిపోయిన నా దగ్గరకి కొండముచ్చులు వచ్చినట్లు నాకు అనిపించలేదు. ధైర్యం చేసి కళ్లు తెరువగా సపోటా చెట్టు దగ్గర చనిపోయిన వ్యక్తి లేరు, కుక్కలు లేవు, కొండముచ్చులు లేవు. “కాపాడావయ్యా నృసింహా…” అనుకుని, ఇంటి వెనుక నుండి గోడ దూకి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపులు బాదేశాను.
నిద్రమొత్తులో ఉన్న ఆయన నా చెమటలు చూసి కూర్చోపెట్టి, భుజం మీద చేయి వేసి ఏమైంది అని అడిగాడు. నేను:
“కనకలక్ష్మి గారిని చంపేశాయి బాబాయ్ కొండముచ్చులు, కుక్కలు ఏమీ చేయలేకపోయాయి.” నాకు కడుపు తిప్పేస్తుంది ఆ సన్నివేశం గుర్తుచేసుకుంటే, వాంతి చేసేసుకున్నాను వరండాలోనే.
బాబాయ్ నీరు ఇచ్చారు, చేతి గుడ్డ ఇచ్చారు, మళ్ళీ కూర్చున్నాను, ఒంట్లో ఒణుకు ఇంకా తగ్గలేదు.
బాబాయ్ నవ్వుతూ,
“నువ్వూ నీ కలలు!!! కనకలక్ష్మి గారు ఇప్పుడు చనిపోవడం ఏంటి రా, ఆమె వాటిని తుపాకీతో బెదిరించగా, కొండముచ్చులు తిరగబడి ఆమెను పీక్కుతిని పాతిక సంవత్సరాలు అవుతుంది.”
నా మెదడులోకి నిశ్శబ్దం అడవిని కాల్చే కార్చిచ్చులా అలుముకుంది.
మూలం: The Monkeys by Ruskin Bond
గమనిక: Ruskin Bond వ్రాసిన కథ కేవలం మూలం మాత్రమే. ఆ కథకి మార్పులు చేసి, అంతిమ ఘట్టాన్ని పూర్తిగా మార్చవేయడం జరిగింది.